మొదలైన పీయూసీ పేపర్ కరెక్షన్
బెంగళూరు: పీయూసీ జవాబు పత్రాల మూల్యాంకనం ఎట్టకేలకు బుధవారం ప్రారంభమైంది. దీంతో విద్యార్థులతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. వేతన పెంపు, వేతనాల తారతమ్య పరిష్కారం కోసం కుమార్‌నాయక్ నివేదిక అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం గత 18 రోజులగా పీయూసీ లెక్చరర్లు మూల్యాంకనాన్ని బహిష్కరించి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వీరితో పలుమార్లు చర్చలు జరిపి ఒక ఇంక్రిమెంట్ పెంపునకు ముందుకు వచ్చినా ఫలితం లేకపోయింది. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్వచ్ఛందంగా నిరసననను విరమించిన లెక్షరర్లు మూల్యాంకన ప్రక్రియకు హాజరయ్యారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46 కేంద్రాలలో 20,500 మంది లెక్చరర్ల ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పీయూ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య మాట్లాడుతూ...‘మే 4,5 తేదీల్లో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సుల ప్రవేశానికి అవసరమైన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) జరగనుంది. అంతకు ముందే అంటే మే 2 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వం మాకు సహకరించకున్నా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మేము నిరసన దీక్షను విరమించాం.’ అని పేర్కొన్నారు.