డబ్బుల్లేవని.. చార్టర్డ్ విమానంలో వెళ్లాడు
న్యూఢిల్లీ: ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకుని, ప్రముఖ విమానయాన సంస్థల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు విమానం ఎక్కారు. రెండు వారాలుగా పలుమార్లు విమానంలో ప్రయాణించేందుకు విఫలయత్నం చేసిన గైక్వాడ్.. డబ్బుల్లు లేవంటూనే చివరకు ఓ చార్టర్డ్ విమానంలో బుధవారం పుణె నుంచి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు శివసేన ఏర్పాట్లు చేసింది.
రెండు వారాల క్రితం విమానంలో సీటు విషయంపై గొడవపడి ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌పై గైక్వాడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ను చెప్పుతో కొట్టినట్టు ఆయన ఒప్పుకొన్నారు. సుకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. కాగా గైక్వాడ్ తప్పు చేసినట్టయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని, విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించే అధికారం ఎవరికీ లేదని శివసేన సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఎయిరిండియా, స్పైస్ జెట్, ఇండిగో సహా పలు విమానయాన సంస్థల్లో గైక్వాడ్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లడానికి శివసేన చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. తనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయాన్ని గైక్వాడ్ పార్లమెంట్‌లో ప్రస్తావించే అవకాశముంది.