శివసేన ఎంపీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగిపై దౌర్జన్యం చేయడంతో ఎయిరిండియా సహా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి ఆయన రైళ్లో వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేయడంతో రోడ్డు మార్గంలో ఢిల్లీకి బయలుదేరారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలని టిక్కెట్లు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు.
గైక్వాడ్ కారులో ఢిల్లీకి బయలుదేరిన విషయాన్ని ఉమర్గా పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. మంగళవారం మధ్యహ్నం గైక్వాడ్, ఆయన భార్య కారులో పుణె నుంచి ఢిల్లీకి పయనమైనట్టు తెలిపారు. బుధవారం సాయంత్రానికి వీరు ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఈ రోజు లోక్ సభ సమావేశాలకు హాజరుకారని వెల్లడించారు. రేపటి నుంచి ఆయన లోక్ సభ సమావేశాలకు హాజరవుతారు.