ఫ్లైట్ ఎక్కడానికి ఏడుసార్లు విఫలయత్నం!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడంతో విమానంలో ప్రయాణించేందుకు ఆయన విఫలయత్నం చేస్తున్నారు. ఏడు రోజుల్లో ఏడుసార్లు ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఈనెల 28 నుంచి ఐదుసార్లు విమానంలో ఢిల్లీ వచ్చేందుకు ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. మూడు సార్లు టిక్కెట్లు కొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన కొనుగోలు చేసిన టిక్కెట్లను రెండుసార్లు ఎయిరిండియా రద్దు చేసింది.
రవీంద్ర గైక్వాడ్ పేరు గుర్తించగానే ఎయిరిండియా టిక్కెట్లు కొనుగోలు చేయకుండా చేస్తోంది. ఒకవేళ టిక్కెట్లు దక్కించుకున్నా రద్దు చేస్తోంది. గత శుక్రవారం(మార్చి 24) ఢిల్లీ నుంచి పుణెకు ఆయన బుక్ చేసుకున్న రెండు టిక్కెట్లను ఎయిరిండియా క్యాన్సిల్ చేసింది. ఈ నెల 24 నుంచి 30 వరకు మొత్తం ఏడుసార్లు ఆయన విఫలయత్నాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్ పేరును నిషేధ జాబితాలో పెట్టినందున టిక్కెట్లు తీసుకోకుండా నిలువరిస్తున్నామని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.