25 సార్లు చెప్పుతో కొట్టాను: ఎంపీ
న్యూఢిల్లీ: తానో ఎంపీనని.. గౌరవ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని, స్థాయిని మరచిపోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం వీరంగం సృష్టించారు. సీటు విషయంపై ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి దాడి చేశారు. ఎంపీ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ, తన చెప్పు తీసి ఎయిరిండియా అధికారిని కొట్టారు.
ఎయిరిండియా అధికారిపై దాడి చేసిన విషయాన్ని గైక్వాడ్ అంగీకరించారు. తన పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించాడని, 25 సార్లు చెప్పుతో కొట్టానని అన్నారు. తాను బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకోగా, ఎకానమీ క్లాస్ సీటు ఇచ్చారని చెప్పారు. ఈ విషయం గురించి తాను ఫిర్యాదు చేయగా, ఎయిరిండియా సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి గైక్వాడ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీటు విషయంపై గొడవ జరిగినట్టు తెలిపారు.