రిస్కు కాదు.. సవాలే..!
‘ఫైండింగ్ ఫ్యానీ’ వంటి ఆఫ్ బీట్ ఆంగ్ల భాష సినిమాలో నటించడం ఓ సవాలు వంటిదని బాలీవుడ్ నటి దీపికా పదుకొణే అభిప్రాయపడింది. ‘ఓం శాంతి ఓం’, ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్‌టైల్’, ‘రేస్ 2’ ‘యే జవానీ హై దివానీ’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, ‘రాంలీలా’ తదితర హిట్ సినిమాల్లో నటించిన దీపిక...హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలోనూ ఓ పాత్రను పోషిస్తోంది. ‘ఇది చాలా రిస్కుతో కూడిన పని అని అనేకమంది నాకు చెప్పారు. అయితే నేను మాత్రం ఆవిధంగా అనుకోవడం లేదు.
ఈ సినిమాలో చేసేందుకు తగినంత ధైర్యం నాకు ఉంది’ అని అంది. ‘ నేను హోమిని విశ్వసించాను. ఆయన ముందుచూపు నాకు బాగా నచ్చింది’ అని పేర్కొంది. కాగా దీపిక గతంలో హోమి దర్శకత్వంలో విడుద లైన ‘కాక్ టైల్’ సినిమాలో నటించింది. ‘సినిమాకు తొలి ప్రాధాన్యమిస్తా. ఆ తర్వాతే పాత్ర గురించి ఆలోచిస్తా. విభిన్నమైన సినిమాలో నటించాలని ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నా. ఈ సినిమాలో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. హిందీ అలవాటైన భాష అయినందువల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు.
అయితే ఆంగ్ల భాషా సినిమాల్లో చేసే సమయంలో కలిగే అనుభవం విభిన్నంగా ఉంటుంది. ఈ భాష సినిమాల్లో అవకాశాలు అంతంతగానే ఉంటాయి. అయితే పరభాష సినిమాల్లో నటించడమనేది ఓ సవాలు వంటిది.’ అని అంది. ఈ సినిమా షూటింగ్ కోసం గోవాలో సెట్లు వేశారు. షూటింగ్‌లో భాగంగా అక్కడ కొంకణి భాషలో మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయమై దీపిక మాట్లాడుతూ మాతృభాషలో మాట్లాడమంటే ఇష్టమని చెప్పింది.