► 40 శాతం ధర తగ్గింపుతో వస్తువుల అమ్మకం పేరిట కుచ్చుటోపీ
► రూ. 50లక్షలతో వ్యాపారి పరార్
► లబోదిబోమంటున్న బాధితులు
► పోలీసులకు ఫిర్యాదు
40 శాతం తగ్గింపుతో గృహోపకరణాలు, ఫ్రిజ్‌లు, టీవీలు, మిక్సీలు, వంటపాత్రలు మొదలైవన్నీ ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టడంతో జనం పోలోమంటూ క్యూ కట్టారు. జనం ఆశని బాగా సొమ్ము చేసుకున్నాడో ప్రబుద్ధుడు. దాదాపు 50లక్షల రూపాయలు వసూలు చేసుకుని ఉడాయించాడు. వస్తువుల కోసం వచ్చిన వారికి షాపు తెరవడకపోవడం తమ నెత్తిన కుచ్చుటోపీ పెట్టాడని బోధపడింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు.
సత్యవేడు: ఆడిమాసం.. బంపర్ ఆఫర్.. 20 రోజులు మాత్రమే.. 40 శాతం తగ్గింపు ధరకే వస్తువులంటూ.. సత్యవేడులో కొత్తగా ప్రారంభించిన ‘సాయిరాం ట్రేడర్స్ అండ్ ఆర్డర్ సప్లైయర్స్’ బోర్డు తిప్పేసింది. స్థానిక ఎంఎస్‌ఎస్ కాంప్లెక్స్‌లో మూడు గదులను తమిళనాడు వాసి ఏ.రాజన్ గత నెల 1న అద్దెకు తీసుకున్నాడు. మూడేళ్లు అగ్రిమెంట్‌తో కాంప్లెక్ అధినేత ఎంపీపీ వి.మస్తాన్ నుంచి బాడుగకు తీసుకున్నాడు. అందులో తనది పుదుకోట జిల్లా కీరమంగళం పోస్టు వెంబన్ గుడి పడమర మీర్ వనైకాడ్ రోడ్డు ఇంటి నెంబరు-166 అడ్రస్ ఉంది. జులై 13వ తేదీన షాపును ప్రారంభించాడు. మూడు గదులకు నెల అద్దె రూ.27వేలు ఇస్తున్నట్లు జనాలను నమ్మించాడు. ఫ్రిజ్, బీరువా, పట్టెమంచం, వంట పాత్రలు , మిక్సీ, గ్రైండర్ మొదలైన వాటిని ఒకొక్కదానినే శాంపిల్‌గా ఉంచాడు.
ఆఫర్ పేరిట ముంచేశాడు
ఆడిమాసం (తమిళపదం) ఆఫర్ పేరిట మండలంలోని 28 పంచాయతీలతో పాటు, సంతల్లోనూ, తమిళనాడులోని గ్రామాల్లో విసృతంగా ప్రచారం చేశాడు. సమీపంలోని ఊత్తుకోట(తమిళనాడు)లోని హోల్‌సేల్ షాపుల కంటే నలభైశాతం తక్కువతో వస్తువులు ఇస్తున్నట్లు కరపత్ర ప్రచారం చేశారు. షాపుకు వచ్చే వినియోదారులకు ఆన్‌లైన్‌లో వస్తువుల ధరలు చూపి వాటికంటే తక్కువ ధరకు ఇస్తున్నామని నమ్మించాడు. ఆఫర్ పోను పూర్తి డబ్బు కట్టిన వారికి 10-15 రోజులలోపు వస్తువులు అందజేస్తామని రసీదు ఇచ్చేవారు. చెప్పినట్లే నెల మొదటి వారంలో కట్టిన వినియోగదారులకు రెండవ వారంలో కొందరికి వస్తువులు అందజేశారు. ఇలా వస్తువులు పొందిన వారు సంబరంగా పలువురికీ చెప్పడంతో ఇది బాగా విస్తృత ప్రచారమైంది. దీంతో మండలంలో 200 నుంచి 400 మంది వరకు పలు రకాల వస్తువుల కోసం అడ్వాన్సుల రూపేణా సుమారు 50లక్షలు కట్టినట్లు సమాచారం. కట్టిన రసీదులపై వినియోగదారులకు ఆగస్టు 1 ,2, 3, 4, 5, 10న వస్తువులు ఇస్తామంటూ బిల్లులపై రాయడంతో అందరూ నమ్మారు. జూలై 31న సెలవు అని బోర్డు పెట్టాడు.
షాపుకొస్తే షాక్..!
ఆగస్టు 1న మంగళవారం వస్తువులు పొందవలసిన వినియోగదారులు పలువురు వచ్చారు. అయితే, షాపు తెరవకపోవడం, వ్యాపారి ఉడాయించాడని ప్రచారంలోకి రావడంతో లబోదిబోమంటూ వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్ అక్కడికి చేరుకున్నారు. పలువురు తమ కష్టార్జితాన్ని వస్తువుల కొనుగోలు కోసం కట్టామని, నిలువునా ముంచేశాడని శాపనార్థాలు పెట్టారు. తన కుమార్తెకు చేయనున్న వివాహం సందర్భంగా అవసరమైన వస్తువుల(మంచం, బీరువా, ఫ్రిజ్, గ్రైండర్, వంట సామాన్లు) కోసం రాజన్‌కు రూ.1.80 లక్షలు ఇచ్చానని సత్యవేడు దళితవాడకు చెందిన ఉషా భోరున విలపించింది. ఇక పెండ్లి మర్యాద ఎట్లా చేయాలి దేవుడా?అని వాపోయింది. సత్యవేడులో రాత్రి పూట ఇడ్లీలు, దోసెలు అమ్మి కూడబెట్టిన రూ.50వేలు ఇస్తే రాజన్ దగా చేశాడని, దేవుడే వాడిని శిక్షిస్తాడంటూ స్థానికురాలు టి.మునిలక్ష్మి శాపనార్థాలు పెట్టింది. ఎవరిని కదిపినా ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. మొత్తం మీద మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరకు వస్తువులు వస్తాయనే ఆశ వారిని నిలువునా ముంచింది.
కేసు నమోదు చేశాం
వ్యాపారి ఏ.రాజన్, ఊరు, పేరు, ఉన్న ఆధార్ కార్డు వివరాలు సేకరించాం. త్వరలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు 100 మందికి పైగా ఫిర్యాదులు అందాయి. –ఎస్‌ఐ. మల్లేష్ యాదవ్