రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, ముంబై: ముంబైలో ‘షేర్ ట్యాక్సీ’లలో ప్రయాణించే సమయంలో ముందు సీట్‌లో మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నారీమన్ పాయింట్-చర్చిగేట్, నారీమన్ పాయింట్ - శివాజీ టెర్మినస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్-లయన్‌గేట్, దాదర్-పాస్‌పోర్ట్ ఆఫీస్ ఇలా వివిధ ప్రాంతాలలోని 20 మార్గాలపై షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. ఈ ట్యాక్సీలలో ప్రయాణికులు ముందు సీట్లలో కూర్చునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వెనుక సీట్లో ఇతర పురుషులతో కూర్చున్న సమయంలో పలు మార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మహిళా ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతే షేర్ ట్యాక్సీలలో ముందు సీటును మహిళలకు కేటాయించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంపై అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ముంబైలో కొత్తగా 70 వేల ట్యాక్సీలు రోడ్డెక్కుతాయని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా షేర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. శివసేన కార్మిక నాయకులు హాజీ అరాఫత్ షేఖ్ గతంలో కుర్లా నుంచి కేవలం మహిళల కోసం షేర్ అటో సేవలను ప్రారంభించారు. ఇటువంటి ప్రయోగాన్ని ట్యాక్సీలలో చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
షేర్ ట్యాక్సీలలో ముందు సీటు మహిళలకు
Published Tue, Feb 10 2015 5:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement