కొండాపురం: వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చవటపల్లె గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. పరిహారం ఇప్పిస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేస్తాం.. లేని పక్షంలో నీళ్లలో మునిగినా సరే అక్కడినుంచి కదిలేది తమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే కదిలేది లేదంటూ వారు మంగళవారం ఉదయం నుంచి కడప-తాడిపత్రి జాతీయరహదారిపై చేపట్టిన ధర్నా.. నేడు కొనసాగుతోంది. గండికోట రిజర్వాయరులో ముంపునకు గురయ్యే ఆరు గ్రామాల్లో చవటపల్లె మొదటిది. గత రెండు నెలల నుంచి అవుకు రిజర్వాయరు నుంచి గండికోటకు నీరు వచ్చి చేరుతోంది.
ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. అయితే, గ్రామంలోని ఇళ్ల చుట్టూ నీరు చేరుతున్నా పరిహారంపై ఉలుకూపలుకూ లేకపోవటంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు పరిహారం ఇస్తే సంతోషంగా ఇళ్లు ఖాళీ చేసి, వెళ్లిపోతామని.. లేకుంటే తాము మునిగినా సరే కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుపైనే వంటావార్పూ చేపట్టారు. రాత్రి సమయమంతా అక్కడే గడిపారు. బుధవారం ఉదయం కూడా రోడ్డుపైనే తమ ధర్నా కొనసాగిస్తున్నారు.