కొబ్బరి నూనె మీద పడేసిందని పెంపుడు తండ్రి తన రెండో భార్య కుమార్తెను విచక్షణరహితంగా కొట్టడంతో సదరు బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన
రెండో భార్య కుమార్తెను చితకబాదిన వైనం
= ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి
= పెంపుడు తండ్రి కర్కశత్వం
బెంగళూరు, న్యూస్‌లైన్ : కొబ్బరి నూనె మీద పడేసిందని పెంపుడు తండ్రి తన రెండో భార్య కుమార్తెను విచక్షణరహితంగా కొట్టడంతో సదరు బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇక్కడి హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నూరాయిన్ తాజ్ అలియాస్ తాజ్ (10) అనే బాలిక మృతి చెందింది. వివరాలు... బాలిక తల్లి ఉస్నా సుల్తానా కొన్నేళ్ల క్రితం మొదటి భర్తతో విడాకులు తీసుకుని అస్లాంను పెళ్లి చేసుకుంది.
అంతకు ముందే సల్తానాకు ముగ్గురు పిల్లలు ఉండగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అస్లాం కూడా నలుగురు సంతానం. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు ఏడుగురు పిల్లలతో ఇక్కడి ధణిసంద్రలోని నందగోకుల లేఔట్‌లో నివాసముంటున్నారు. సుల్తానా స్థానికంగా ఉంటున్న గార్మెంట్స్‌లో పనిచేస్తుండగా, అస్లాం ఆటోడ్రైవర్. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న నూరాయిన్ తాజ్ తలకు నూనె రాసుకుంటుండగా పొరబాటున అస్లాంపై పడింది.
దీంతో అస్లాం తీవ్ర ఆగ్రహంతో బాలికను విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీ, కడుపు భాగంలో తన్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లికి కడుపునొప్పి అని చెప్పడంతో ఆమె బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని పోలీసులు తెలిపారు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం అస్లాంను అరెస్ట్ చేశారు. హెణ్ణూరు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.