ప్రేమికుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న యువతి, బంధువులు
కేకే.నగర్: ప్రేమ పేరుతో మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడి వివాహాన్ని ప్రియురాలు అడ్డుకుంది. వివాహ మండపంలోనే ప్రియుడిని నిలదీసింది. ఈ సంఘటన విల్లుపురం జిల్లా విక్రవాండిలో చోటుచేసుకుంది. ప్రియుడికి వేరే యువతితో వివాహం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రియురాలు అతని ఇంటి ముందు బంధువులతో ధర్నాకు దిగడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని సెండియం పాక్కంకు చెందిన గోపాలకృష్ణన్(25) చెంగల్పట్టు చెక్‌పోస్టులో ఉద్యోగి. గోపాలకృష్ణన్‌కు, సెంజికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి విక్రవాండిలో కల్యాణమండపంలో సోమవారం జరగనుంది. గోపాలకృష్ణన్ తాళికట్టే సమయంలో చెన్నై సెమ్మంజేరికి చెందిన అర్చన(21) మండపానికి చేరుకుని వివాహం అడ్డుకుంది. తాను చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నానని, తానూ, గోపాలకృష్ణన్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణన్ నమ్మించాడని దీంతో శారీరకంగా దగ్గరయ్యామని, ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతి అని చెప్పి బోరున విలపించింది. దీన్ని చూసి పెళ్లికూతురు పెళ్లిపీటల మీద నుంచి లేచి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరి వద్ద విచారణ జరిపారు. చివరకు అర్చనను పెళ్లి చేసుకోవడానికి గోపాలకృష్ణన్ ఒప్పుకోవడంతో అర్చన శాంతించింది.