టెన్‌తలోనూ టాపే
కొనసాగిన బాలికల హవా..
* మొత్తం ఉత్తీర్ణత శాతం 81.19 బాలురు 77%,బాలికలు 85.46 %
* 2,023 స్కూళ్లల్లో అందరూ పాస్,17లో అందరూ ఫెయిల్
* మెరుగైన ఫలితాలు సాధించిన గ్రామీణ విద్యార్థులు
* జిల్లాల వారీగా ఉత్తీర్ణతలోటాప్ చిక్కోడి, లాస్ట్ బీదర్
* తాలూకాల్లో జోయిడా ఫస్ట్, గౌరిబిదనూరు ఆఖరు
సాక్షి, బెంగళూరు : పదోతరగతి పరీక్ష ఫలితాల్లోనూ బాలికలే ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 8,13,498 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 6,60,515 శాతం మంది (81.19 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే (77.47) ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 3.72 శాతం ఎక్కువ. మొత్తం 4,32,533 మంది బాలురకు గాను 3,34,925 (77 శాతం) మంది, 3,80,965 మంది బాలికలకు 3,25,590 (85.46 శాతం) మంది పాస్ అయ్యారు. ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ మల్లేశ్వరంలోని ఎస్‌ఎస్‌ఎల్‌సీ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
రాష్ర్టంలో మొత్తం 2,023 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా.. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. పట్టణ విద్యార్థుల కంటే (80.84) గ్రామీణ విద్యార్థులు (85.33) ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే చిక్కోడి, సిరిసి, బెల్గాం వరుసగా మొదటి, రెండు, మూడో స్థానంలో ఉండగా బీదర్ చివరి స్థానంలో ఉంది. తాలూకాల పరంగా తీసుకుంటే ఉత్తర కన్నడ జిల్లాలోని జోయిడా (సూపా) 97.26 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం, 64.07 శాతం ఉత్తీర్ణతతో గౌరిబిదనూరు చివరి స్థానంలో ఉంది. ఇక ఈ ఏడాది 40 నుంచి 58 ఏళ్ల మధ్య ఉన్న ఉన్నవారు 866 మంది ఈ పరీక్షలు రాయగా అందులో 75 మంది పాస్ అయ్యారు. 478 మంది విద్యార్థులు తెలుగు మాద్యమంలో పరీక్షలు రాయగా అందులో 320 మంది (66.95 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇంగ్లీషు మీడియంలో వీరే ఫస్ట్..
* మైసూరులోని మల్లప్ప హైస్కూల్‌లో చదువుతున్న నిత్యసురభి 625 మార్కులకు గాను 622 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
* 621 మార్కులతో అభిజ్ఞా, అభిలాష, సింధూ బదరి, ధన్యభారతి రెండో స్థానాన్ని ఆక్రమించారు. వీరంతా బెంగళూరు నార్త్‌కు చెందిన వారే కావడం గమనార్హం.
* 620 మార్కులతో అనుజ్ఞా, హైమావతి, అక్షయరాఘవన్, రాహుల్, మైథిలి మూడో స్థానంలో నిలిచారు.
* కన్నడ మీడియంలో 617 మార్కులతో చిక్కోడికి చెందిన విషల్ మొదటి స్థానం, 615 మార్కులతో మైత్రీ హెగ్డే రెండో స్థానం, 614 మార్కులతో నాగరాజ్ కామత్ మూడో స్థానాన్ని పొందారు.
* సబ్జెక్టుల పరంగా తీసుకుంటే సాంఘికశాస్త్రంలో అత్యధికంగా 1,058 మంది వందకు వంద మార్కులు, అతి తక్కువగా విజ్ఞానశాస్త్రంలో 16 మంది వందకు వంద మార్కులు సాధించారు.