గోపాల్ కందాకు ఊరట | Gopal Kanda to relief | Sakshi
Sakshi News home page

గోపాల్ కందాకు ఊరట

Published Thu, Sep 5 2013 11:20 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

Gopal Kanda to relief

న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఆత్మహత్య కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాకు ఊరట లభించింది. హర్యానా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో పాటు శిర్సా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వెచ్చించేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను మన్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో కందా అభ్యర్థనను పరిశీలించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నామని అదనపు సెషన్స్ జడ్జి ఎంసీ గుప్తా మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.ఐదు లక్షలతో పాటు ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే దేశం విడిచి బయటకు వెళ్లరాదని, న్యాయం నుంచి తప్పించుకోవొద్దనే వివిధ షరతులను విధించారు. 
 
 ఈ బెయిల్‌పై బుధవారమే వాదనలు జరగగా కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన అరుణ చద్దాకు పండుగలు, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నవంబర్ 15 వరకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మధ్యంతర బెయిల్ కాల పరిమతిని తగ్గించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. 
 
 ఇదిలావుండగా హర్యానాలోని సిర్సా నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరఫు సీనియర్ న్యాయవాది రమేశ్ గుప్తా బుధవారం వాదించారు. అతి పెద్ద నియోజకవర్గమైన శిర్సా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేరవేయాల్సిన బాధ్యత కందాపై ఉందని అన్నారు. తన నియోజకవర్గ నిధులను ఉపయోగించకపోవడంతో ప్రజలు బాధ పడాల్సి వస్తోందని తెలిపారు. గత 14 నెలల నుంచి పోలీసు కస్టడీలో కందా ఉన్నాడని, పోలీసుల దర్యాప్తు కూడా పూర్తయిందని, దీంతో ఈ కేసుకు హాని కలిగించే అవకాశమే లేదని అన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కోర్టు కందాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే దీన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ తోసిపుచ్చారు. సాక్ష్యాన్ని  తారుమారు చేసే అవకాశముండటంతోనే పోలీసు కస్టడీలో ఉంచుతున్నారని అన్నారు. 2013, ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బెయిల్ మాత్రం అడగలేదు. 
 
 అయితే ఇప్పుడు ఈ సభల కోసం మధ్యంతర బెయిల్‌ను ఎందుకు అడుగుతున్నాడు? సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశముందని, అతనికి బెయిల్‌ను ఇవ్వొద్దని వాదించారు. అయితే దీనిపై నిర్ణయాన్ని బుధవారం రిజర్వ్‌లో ఉంచిన కోర్టు కందాకు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, గతేడాది ఆగస్టు 8, 18న చందా, కందాలను పోలీసులు అరెస్టు చేశారు. మే 27 ప్రారంభమైన ఈ కేసు విచారణలో ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటివరకు నమోదు చేసింది. వీరిలో పోలీసు అధికారితో పాటు బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు కూడా ఉన్నారు. కందా ఎండీఎల్‌ఆర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఉద్యోగి ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకునేలా కందా, అరుణ చద్దా ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో 2012 ఆగస్టు 5న ఎయిర్‌హోస్టెస్ మరణించింది.  అయితే  కందా, చద్దాల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement