బాధిత కుటుంబాలపట్ల తమ ప్రభుత్వం ఎంతో సానుభూతితో ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు.
ముంబై: బాధిత కుటుంబాలపట్ల తమ ప్రభుత్వం ఎంతో సానుభూతితో ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సదరు కుటుంబాలకు న్యాయం జరిగేవిధంగా చేసేందుకు చట్టపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగినందువల్లనే సుప్రీం కోర్టు గతంలో కూల్చివేత ఆదేశాలిచ్చిందన్నారు. కూల్చివేయమనడం దారుణమని, ఇటువంటి అనుమతి లేని నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి తాము ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదంటూ ఆదేశించిందన్నారు. క్యాంపాకోలా వాసులకు కొంత ఊరట లభించిందన్నారు. అటార్నీ జనరల్ వాహనవతితోపాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) న్యాయవాది ఈ విషయంలో తమకు సహకరిస్తారన్నారు. దీంతోపాటు పట్టణాభివృద్ధి శాఖ కూడా సహకరిస్తుందన్నారు.