
మాటలొద్దు
రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి వట్టి మాటలతో అధికారులతో తగువులాడ డం సరికాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ క్లాస్ పీకారు.
- ముఖ్యమంత్రికి గవర్నర్ క్లాస్
- అధికారులతో వాగ్వాదం వద్దు
- సమన్వయంతో నీటి ఎద్దడిని పరిష్కరించండి
- మంత్రుల చర్యలను నియంత్రించకపోతే ఎలా?
- కోడ్ ముగిసినా జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించరేం?
- యూఆర్ అనంతమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వొద్దు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి వట్టి మాటలతో అధికారులతో తగువులాడ డం సరికాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ క్లాస్ పీకారు. పౌర సేవ మండలి పరిధిలోకి ఐపీఎస్‌లను చేర్చడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఐఏఎస్ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రాసం కూడా లభ్యం కాక పశువులను కబేళాలకు తరలిస్తుంటే మంత్రులు ఏం చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసినా ఆయా జిల్లాల అభివ ృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇన్‌చార్జ్ మంత్రులు సమీక్ష నిర్వహించకపోవడం సరికాదు. ఇలా అయితే ప్రజా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యం’ అని సీఎంని నిలదీసినట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్‌లతో చిన్నపాటి విషయాలకే వాగ్వాదాలకు దిగకుండా సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి క ృషి చేయాలని సీఎంకి సూచించినట్లు తెలిసింది. సాహితీ వేత్తల కోటా కింద ఎమ్మెల్సీగా యూఆర్ అనంతమూర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయరాదని సీఎంకి స్పష్టం చేశారు. కాగా, చిక్కమగళూరు షూటవుట్ ఘటనకు సంబంధించి హోం శాఖతో పాటు ప్రభుత్వ చర్యలను గవర్నర్ తప్పుబట్టారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తమ భేటీకి ప్రాముఖ్యత ఏదీ లేదని, ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పుకొచ్చారు.