సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుయాయులు అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎక్కడా చూసిన లౌడ్ స్పీకర్లలో ఆయన జీవిత చరిత్ర తెలిపే పాటలు వినిపించాయి. దాదర్‌లోని చైత్యభూమిలోని అంబేద్కర్ విగ్రహనికి సోమవారం ఉదయం గవర్నర్ శంకర్‌నారాయణన్, హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీఎంసీ కమిషషర్ సీతారాం కుంటే, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే, వివిధ పార్టీలకు చెందిన నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
కొల్హాపూర్‌లో...: స్థానిక బిందు చౌక్‌వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మేయర్ సునీత రావుత్, కార్మిక శాఖ మంత్రి హసన్ మశ్రీప్ తదితరులు నివాళులర్పించారు.
ఆంధ్ర ప్రజా సంఘం హాలులో...
ముంబైలోని ఆంధ్ర ప్రజా సంఘం హాలులో అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వీజే రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధ భగవాన్, శివాజీ మహరాజ్ చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షుడు జె.మన్మథరావు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో డీవీ రావు, ఎం.సాయి సారథి, జేవీ మూర్తి విశ్వనాధ్, టి.ప్రకాశ్ పాల్గొన్నారు.
తూర్పుడోంబివల్పిలో...
తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక, శ్రమజీవి సంఘం సంయుక్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సోమవారం నిర్వహించారు. తూర్పుడోంబివలిలోని అయిరే గావ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దుర్గేష్ అక్కెనపెల్లి మాట్లాడుతూ...సమాజానికి పట్టిన రుగ్మతలను తొలగించడానికి బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారన్నారు. ఆయన కన్న కలలను నిజం చేసిననాడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడచినా అంటరానితనం, మూఢ నమ్మకాలుసమసిపోలేదని రమేష్ గొండ్యాల విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్ గంబ్రె, నార్ల సతీష్, అల్లి మల్ల్లేష్, శ్రీమల్, సంఘ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో...
తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్‌లో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. దళితులు, బహుజనులకు మాత్రమే కాకుండా ప్రతి వర్గానికి సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొంపల్లి జాన్, ఉపాధ్యక్షులు ఆరే కృపానందం, కార్యదర్శి బత్తుల లింగం, కోశాధికారి సంఘం ప్రభాకర్, మగ్గిడి, రవి, సభ్యులు సంగేమ్, వినోద్ బాస, మహేష్, తలారి ఆనందం, బొండొల్ల సుదర్శన్, కొలి గంగారాంలు పాల్గొన్నారు.
అంబేద్కర్‌కు ఘన నివాళి
Published Mon, Apr 14 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
Advertisement