r.r.patil
-
మహారాష్ట్రపై చిన్నచూపు
సాక్షి, ముంబై: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముంబై భద్రతను గాలికి వదిలేసి గుజరాత్‌కు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా అవతరించిన పాల్ఘర్ జిల్లాలో ఏర్పాటు చేయదలచిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ పోలిసింగ్’ (ఎన్‌ఐసీపీ) కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోడీ వైఖరిపై మండిపడ్డారు. మహారాష్ట్రపై సవతి తల్లి ధోరణి అవలంభిస్తున్నారని, తన సొంత రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తున్నారని పరోక్షంగా మోడీపై ఆరోపణలు చేశారు. ముంబై భద్రతను కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. తీర ప్రాంతాల భద్రత కోసం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఎన్‌ఐసీపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన305 ఎకరాల స్థలాన్ని నామమాత్రపు ధరకే సమకూర్చి ఇచ్చింది. కాని ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ కేంద్రాన్ని గుజరాత్‌లోని ద్వారకాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ‘ముంబైపై ఇదివరకే అనేకసార్లు ఉగ్రవాదులు దాడులు జరిపారు.. ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఇప్పటికీ నగరం హిట్ లిస్టులో ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని పాల్ఘర్లో నిర్మించేందుకు యూపీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. కాని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వం ఎలాంటి కారణాలు చూపకుండానే ఈ కీలకమైన కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించాలని నిర్ణయం తీసుకోవడంలో ఉద్ధేశ్యమేమిట’ని పాటిల్ నిలదీశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది. ఎన్‌ఐసీపీ సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చి ఇచ్చినందున దాన్ని ఇప్పుడు మరో రాష్ట్రానికి తరలించాలని చూడటం నియమాలకు విరుద్ధమని పాటిల్ స్పష్టం చేశారు. కాని కేంద్రం దీనిపై ఏమీ స్పష్టం చేయకుండా గుజరాత్‌కు తరలిస్తోందని ఆయన ఆరోపించారు. -
పోలీసు శాఖకు తాయిలాలు..ఐదు రోజులే పని
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసు శాఖను ప్రసన్నం చేసుకునేందుకు హోం మంత్రి తాయిలాలు ప్రకటించారు. ప్రస్తుతం విపరీతమైన పనిభారంతో సతమతమవుతున్న పోలీస్ సిబ్బందికి భవిష్యత్తులో మంచిరోజులు రానున్నాయని చెప్పారు. వారానికి ఐదురోజులు పని, పెళ్లిరోజు సెలవు, తగినంత సిబ్బంది నియామకం తదితర వరాలు ప్రకటించారు. సాక్షి, ముంబై: పోలీసు సిబ్బందికి కార్పొరేట్ స్థాయిలో వారానికి ఐదు రోజులు పనిదినాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు. దాదర్‌లోని నాయ్‌గావ్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పాటిల్ హాజరయ్యారు. రాష్ట్ర పోలీస్‌శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడున్న సిబ్బందిపై విపరీతమైన పనిభారం పడుతోందని ఆయన అన్నారు. అత్యవసర సమయాల్లో, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పోలీసులకు వారాంతపు సెలవులు కూడా రద్దు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఉత్సవాలు, పండుగలు తమ కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోతున్నారని, ఇది వారిని మానసికంగా వేధిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావుండదని పాటిల్ హామీ ఇచ్చారు. అందుకే ఈ సమస్య పరిష్కారానికి, శాఖను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో 66 వేల పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పోలీసులు వారి పెళ్లి రోజు (మ్యారేజ్ డే) ను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అవసరమైన సెలవు మంజూరు చేస్తామని అన్నారు. వివిధ రాష్ట్రాలతో పోలీస్తే మహారాష్ట్రలో మహిళ పోలీసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేశారు. పోలీసులపై పడుతున్న అదనపు భారాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా వారానికి ఐదు రోజులు విధులు నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రికి పంపించినట్లు చెప్పారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకానికి మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసు భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకోగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు నియమ, నిబంధనాల్లో కొన్ని మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే మహిళా పోలీసు భర్తీ ప్రక్రియలో మార్పులు చేయడంవల్ల వారు పోలీసు శాఖలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. -
బకాయిలు రాక బాధలు
సాక్షి, ముంబై: అన్ని కేసులను పరిష్కరించే పోలీసు లు తమకు రావాల్సిన బకాయిలను మాత్రం వసూలు చేసుకోలేకపోతున్నారు. రక్షణ కోసం పోలీసు బందోబస్తు తీసుకున్న వివిధ సంస్థలు ఇంతవరకు రూ.79.19 కోట్లు చెల్లించనే లేదు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పక్షం రోజుల్లో ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బకాయిలు పడినవాటిలో 48 సంస్థలు/కంపెనీలు, 25 బ్యాంకులు, 70 మంది ప్రముఖు లు ఉన్నారు. వీరంతా రక్షణ కోసం పోలీసు సిబ్బందిని నియమించుకున్నారు. అందుకు చెల్లిం చాల్సిన రూ. 79.19 కోట్లు ఇంతవరకు ప్రభుత్వ ఖజానాలో జమచేయలేదు. పలుమార్లు లేఖలు పంపించినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ఆస్తు లు జప్తుచేయాలని నిర్ణయించినట్లు పాటిల్ వెల్లడిం చారు. రాష్ట్ర పోలీసుశాఖతో పోలిస్తే ముంబై పోలీసుశాఖకు బకాయిల బెడద ఎక్కువగా ఉంది. నగర పోలీసుశాఖ నుంచి రక్షణ తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు రూ. 2.67 కోట్లు బకాయిలు పడ్డారు. ఇందులో రాజకీయ పార్టీకి చెందిన బడా నాయకుడు ఏకంగా రూ. 1.68 కోట్లు బకాయిలుపడ్డాడు. బకాయిలు చెల్లించాలని ఆయనకు పలుమార్లు లేఖలు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీంతో ముందుగా ఆస్తుల జప్తు నోటీసు జారీ చేయనున్నట్లు పాటిల్ తెలిపారు. బకాయిదారుల్లో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) రూ. 31 కోట్లు, బ్యాంకులు రూ.8.23 కోట్లు, విదర్భ క్రికెట్ జట్టు రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదాధికారులు, నాయకులతో మంగళవారం సాయంత్రం శరద్ పవార్ ఈ విషయమై సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవ్వాలని ఆదేశించారు. ఎన్సీపీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు భాస్కర్ జాధవ్తోపాటు ఛగన్ భుజ్‌బల్, ఆర్.ఆర్. పాటిల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే, మధుకర్ పిచడ్, వసంత్ ఢావ్కరే, విజయ్‌సింహ మోహితే పాటిల్ తదితరులు హాజరయ్యారు. అయితే ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవ్హాడ్, సునీల్ తట్కరేలు మాత్రం హాజరుకాలేదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ఎన్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికలు ఈ నెల 24వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడనున్నాయి. అయితే ఫలితాల కోసం ఆలోచిస్తూ కూర్చోకుండా మరో నాలుగైదు నెలల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవ్వాలని పార్టీ నాయకులకు శరద్‌పవార్ ఆదేశించారు. రాబోయే ఎన్నికల వ్యూహంపై చర్చలు...! రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనపై ఈ సమావేశాల్లో చర్చించారని తెలిసింది. ముఖ్యంగా మొదటి సమావేశం అనంతరం భాస్కర్ జాధవ్, ఆర్.ఆర్. పాటిల్, ఛగన్ భుజ్‌బల్ తదితర సీనియర్ నాయకులతో మరో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అనుకూలంగా ఉంటే ఎటువంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలి? ప్రతికూలంగా ఉంటే వ్యూహరచన ఎలా ఉండాలి? అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది. ఒంటరిపోరుకు సిద్ధమవుతున్న ఎన్సీపీ...? లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వెలువడే అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతుండడంతో రాష్ట్రంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే దిశగా ఎన్సీపీ యోచిస్తున్నట్లు సమాచారం. అదీగాక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు వద్దనే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేయడం, ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యలు కూడా ఎన్సీపీని ఒంటరిపోరువైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే పొత్తు వద్దంటూ ప్రకటనలు వెలువడడంతో కాంగ్రెస్‌నే దోషిగా చూపుతూ బయటకు రావాలనే యోచనలో ఎన్సీపీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవార్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. -
అంబేద్కర్‌కు ఘన నివాళి
సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుయాయులు అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎక్కడా చూసిన లౌడ్ స్పీకర్లలో ఆయన జీవిత చరిత్ర తెలిపే పాటలు వినిపించాయి. దాదర్‌లోని చైత్యభూమిలోని అంబేద్కర్ విగ్రహనికి సోమవారం ఉదయం గవర్నర్ శంకర్నారాయణన్, హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీఎంసీ కమిషషర్ సీతారాం కుంటే, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే, వివిధ పార్టీలకు చెందిన నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కొల్హాపూర్‌లో...: స్థానిక బిందు చౌక్‌వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మేయర్ సునీత రావుత్, కార్మిక శాఖ మంత్రి హసన్ మశ్రీప్ తదితరులు నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజా సంఘం హాలులో... ముంబైలోని ఆంధ్ర ప్రజా సంఘం హాలులో అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వీజే రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధ భగవాన్, శివాజీ మహరాజ్ చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షుడు జె.మన్మథరావు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో డీవీ రావు, ఎం.సాయి సారథి, జేవీ మూర్తి విశ్వనాధ్, టి.ప్రకాశ్ పాల్గొన్నారు. తూర్పుడోంబివల్పిలో... తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక, శ్రమజీవి సంఘం సంయుక్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సోమవారం నిర్వహించారు. తూర్పుడోంబివలిలోని అయిరే గావ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దుర్గేష్ అక్కెనపెల్లి మాట్లాడుతూ...సమాజానికి పట్టిన రుగ్మతలను తొలగించడానికి బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారన్నారు. ఆయన కన్న కలలను నిజం చేసిననాడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడచినా అంటరానితనం, మూఢ నమ్మకాలుసమసిపోలేదని రమేష్ గొండ్యాల విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్ గంబ్రె, నార్ల సతీష్, అల్లి మల్ల్లేష్, శ్రీమల్, సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో... తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్లో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. దళితులు, బహుజనులకు మాత్రమే కాకుండా ప్రతి వర్గానికి సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొంపల్లి జాన్, ఉపాధ్యక్షులు ఆరే కృపానందం, కార్యదర్శి బత్తుల లింగం, కోశాధికారి సంఘం ప్రభాకర్, మగ్గిడి, రవి, సభ్యులు సంగేమ్, వినోద్ బాస, మహేష్, తలారి ఆనందం, బొండొల్ల సుదర్శన్, కొలి గంగారాంలు పాల్గొన్నారు.