సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదాధికారులు, నాయకులతో మంగళవారం సాయంత్రం శరద్ పవార్ ఈ విషయమై సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవ్వాలని ఆదేశించారు. ఎన్సీపీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు భాస్కర్ జాధవ్‌తోపాటు ఛగన్ భుజ్‌బల్, ఆర్.ఆర్. పాటిల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే, మధుకర్ పిచడ్, వసంత్ ఢావ్‌కరే, విజయ్‌సింహ మోహితే పాటిల్ తదితరులు హాజరయ్యారు.
అయితే ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవ్హాడ్, సునీల్ తట్కరేలు మాత్రం హాజరుకాలేదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ఎన్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికలు ఈ నెల 24వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వెలువడనున్నాయి. అయితే ఫలితాల కోసం ఆలోచిస్తూ కూర్చోకుండా మరో నాలుగైదు నెలల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవ్వాలని పార్టీ నాయకులకు శరద్‌పవార్ ఆదేశించారు.
రాబోయే ఎన్నికల వ్యూహంపై చర్చలు...!
రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనపై ఈ సమావేశాల్లో చర్చించారని తెలిసింది. ముఖ్యంగా మొదటి సమావేశం అనంతరం భాస్కర్ జాధవ్, ఆర్.ఆర్. పాటిల్, ఛగన్ భుజ్‌బల్ తదితర సీనియర్ నాయకులతో మరో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అనుకూలంగా ఉంటే ఎటువంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలి? ప్రతికూలంగా ఉంటే వ్యూహరచన ఎలా ఉండాలి? అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది.
ఒంటరిపోరుకు సిద్ధమవుతున్న ఎన్సీపీ...?
లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వెలువడే అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతుండడంతో రాష్ట్రంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనే దిశగా ఎన్సీపీ యోచిస్తున్నట్లు సమాచారం. అదీగాక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్రలో ఎన్సీపీతో పొత్తు వద్దనే అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేయడం, ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యలు కూడా ఎన్సీపీని ఒంటరిపోరువైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే పొత్తు వద్దంటూ ప్రకటనలు వెలువడడంతో కాంగ్రెస్‌నే దోషిగా చూపుతూ బయటకు రావాలనే యోచనలో ఎన్సీపీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవార్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది.
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
Published Wed, Apr 30 2014 10:33 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement