కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఏపీ సర్కార్.. కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షను భగ్నం
కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాడులా?
ముద్రగడకు మద్దతుగా ప్రవాసాంధ్ర కాపు నేతల ధర్నా
సాక్షి ప్రసారాలు నిలిపివేయడం హేయం
బెంగళూరు(బనశంకరి) : కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఏపీ సర్కార్.. కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షను భగ్నం చేసి అమానుషంగా వ్యవహరించిందని ప్రవాసాంధ్ర కాపు నేతలు మండిపడ్డారు. ముద్రగడకు మద్దతుగా ప్రవాసాంధ్ర కాపులు ఆదివారం బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాపు నేత డాక్టర్ జగన్నాథ్‌రావు మాట్లాడుతూ... కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ తర్వాత గాలికొదిలేశారన్నారు. ఈ నేపథ్యంలో కాపుల కోసం దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబసభ్యులను పోలీసుల చేత బలవంతంగా లాక్కెళ్లి ఆస్పత్రికి తరలించడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
ముద్రగడ పద్మనాభంను పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇది చంద్రబాబు నిరంకుశ పాలనను గుర్తు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాక్షి ఛానల్ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం నిలిపివేయించి నీచ రాజకీయాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బత్తుల అరుణాదాస్, మూర్తి, ఆస్ట్రేలియా నుంచి విచ్చేసిన ప్రవాసాంధ్రుడు రావు, నాగబాబు, భరత్, చిత్తూరు శ్రీను బాలాజీ, మదన్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.