శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట
విజయవాడ: కార్తీకమాసం ఆఖరు సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. దీపోత్సవాలు నిర్వహించి ఈశ్వరుడిని దర్శించుకుని తరించారు. విజయవాడలోని కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్య స్నానాలు చేశారు. అరటి దొప్పలలో దీపారాధనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు.
కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం సంగమేశ్వరం, మచిలీపట్నం మండలం మంగినపూడిలో తెల్లవారుజామున సముద్ర స్నానాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గుంటూరుజిల్లా బాపట్లలోని సూర్యలంక, ప్రకాశంజిల్లా చీరాల వాడరేవుల్లో భక్తులు సముద్ర స్నానాలు చేశారు. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. తిరుపతి కపిలతీర్థంలో భక్తులు బారులు తీరారు. గుంటూరుజిల్లా అమరావతి, కోటప్పకొండ, పశ్చిమగోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, తూర్పుగోదావరిజిల్లాలోని దక్షారామం వంటి పంచారామాల్లో భక్తులు కార్తీక మాస పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో.. ఘాట్‌లకు పుష్కర శోభ సంతరించుకుంది.
కరీంనగర్‌జిల్లా వేములవాడలో భక్తులు గుండంలో స్నానాలు చేసి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కొమురవెల్లిలలో కూడా భక్తులు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని, ధర్మపురిలో నర్సింహస్వామి ఆలయాన్ని, కాళేశ్వరంలోని ఆలయాన్ని, వరంగల్ వేయిస్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను దర్శించుకున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. కీసర గుట్టపై కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొత్త శోభను సంతరించుకుంది.