ముంచేసింది
►బెంగళూరులో మళ్లీ కుండపోత
►నాలుగురోజులుగా ఇదే తంతు
►అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు
►రాత్రంతా జనం జాగారం
►తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు
బనశంకరి: గత మూడు నాలుగురోజులుగా వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో ఐటీ సిటీ మళ్లీ ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. నగరంలో చాలా పల్లపు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, బీళేకనహళ్లి, కోరమంగలతో పాటు పలు ప్రాంతాల్లో గత రెండు రోజుల క్రితం భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి మళ్లీ వర్షం కురవడంతో మరింత నీరు చేరడంతో ఈ ప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది.
ఎక్కడెక్కడ?
►కృష్ణరాజపురం నియోజకవర్గంలోని రాంపుర చెరువుకట్ట తెగిపోవడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరి ఆ ప్రాంతవాసులు రాత్రంతా జాగరణ చేశారు.
► వసంతపుర వార్డులోని జనార్దనచెరువు తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. మేయర్ పద్మావతి సోమవారం మధ్యాహ్నం అక్కడ పర్యటించి అధికారులకు సూచనలిచ్చారు.
►బసవనపుర వార్డులో గల రాజకాలువ వాననీటితో పొంగిపొర్లి సుమారు 50 ఇళ్లలోకి వర్షంనీరు చేరింది. గాయత్రినగర లేఔట్ భారీ వర్షం కురవడంతో పలు ఇళ్లలోకి వాననీరు చొరబడి నివాసితులు ఇక్కట్లు పడ్డారు.
►త్రివేణినగర ప్రభుత్వ స్కూల్ మైదానంలో మూడు అడుగులకు పైగా నీరునిలిచిపోవడంతో బడికి సోమవారం సెలవు కూడా ప్రకటించారు. దొడ్డనెక్కుంది, విజినాపుర, హొరమావు వార్డుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు వర్షం కురవడంతో రోడ్లుపై మూడునాలుగు అడుగులకు పైగా నీరు నిలిచిపోయింది.
►నగర నడిబొడ్డున ఉన్న రాజాజీనగర, బసవేశ్వరనగర, నాగరభావి, పాపిరెడ్డిపాళ్య, నవరంగ్ థియేటర్, శంకరపుర, బసవనగుడి, గాంధీనగరతో పాటు చాలా ప్రాంతాల్లో ఆదివారం రాత్రి పెద్ద వర్షం కురిసి డ్రైనేజీలు, రాజకాలువలు పొంగిపొర్లి రోడ్లన్నీ బురద, చెత్తతో నిండిపోయాయి. పౌరకార్మికులు వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
► నగరాభివృద్ది శాఖామంత్రి కేజే.జార్జ్ నియోజవర్గమైన సర్వజ్ఞనగరలో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. నందగోకుల లేఔట్ , ఎస్‌వీఎస్ స్కూల్‌లో వర్షం నీరు చేరింది.
వర్షాలు తగ్గిన తరువాతే మరమ్మతులు: మంత్రి జార్జ్
గత మూడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో నగరరోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. వర్షానికి విరామమిచ్చిన తరువాతనే రోడ్లకు మరమ్మత్తులు చేస్తామని బెంగళూరు నగరాభివృద్ది శాఖామంత్రి కేజే.జార్జ్ సోమవారం మీడియాకు తెలిపారు. నాలుగురోజులుగా వర్షం వల్ల రోడ్లు ధ్వంసమైనట్లు తెలిపారు.