కర్నూలు జిల్లాలో భారీ వర్షం
– నంద్యాల, గోస్పాడు, మహానందిలో భారీ వర్షం
– వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు
– లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్లు
– ఆదోని డివిజన్‌లో జల్లులు మాత్రమే
– నాలుగు మండలాల్లో చినుకు కరువు
కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడు కరుణించాడు. తీవ్ర వర్షాభావంతో ఎండుతున్న పంటలకు ప్రాణం పోశాడు. జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 31 మీ.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో భారీగా వర్షాలు పడగా, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. నంద్యాల, గోస్పాడు, మహానంది, చాగలమర్రి, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నంద్యాల, గోస్పాడులలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. వివిధ మండలాల్లో ఆరబెట్టిన ఉల్లి తడచిపోయింది. ముందే ధరలు పడిపోయి అల్లాడుతున్న రైతులకు ఉల్లి తడువడంతో ధరలు మరింత పడిపోయో ప్రమాదం ఏర్పడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న పత్తి, కంది, ఆముదం పంటలకు ప్రాణం పోశాయి. ఆదోని డివిజన్‌లో అక్కడకక్కడ జల్లులు మాత్రమే కురిశాయి. నందవరం హŸళగొంద, ఆలూరు, హాలహర్వి మండలాల్లో చినుకు జాడ లేదు. జిల్లాలో ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 65.5మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ నెలలో వర్షపాతం లోటు 51 శాతం ఉంది.
వర్షపాతం నమోదు వివరాలు
మండలం వర్షపాతం (మి.మీ.)
నంద్యాల 162.4
గోస్పాడు 162.4
మహానంది 110.6
చాగలమర్రి 92
కొలిమిగుండ్ల 80.2
పాణ్యం 77.2
పగిడ్యాల 67.4
శిరువెళ్లలో 60.4
బండిఆత్మకూరు 56.8
నందికొట్కూరు 44.6
జూపాడుబంగ్లా 44.6
మిడుతూరు 43.4
ఓర్వకల్ 43.4
కోవెలకుంట్ల 40
బనగానపల్లె 40
దొర్నిపాడు 34
బేతంచెర్ల 30.6
సంజామల 30.2
వెలుగోడు 28.4
గూడూరు 27.4
గడివేమలు 25.8
ఆత్మకూరు 24
కొత్తపల్లి 22.8
ఎమ్మిగనూరు 22.4
డోన్ 21.2