సింగరేణిలో 'వారసత్వ' ఒత్తిడి
హక్కు పునరుద్ధరణకు ప్రతిపక్ష సంఘాల పోరాటం
26న అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు
స్పందన రాకుంటే దీర్ఘకాలిక సమ్మెకు..
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అతి త్వరలో జరగనున్నారు. ఈ సమయంలో టీబీజీకేఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్ష సంఘాలు వారసత్వ ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వం, యూజమాన్యంపై ఒత్తిడి తేవడానికి సన్నద్ధమవుతున్నారు. ‘వారసత్వాన్ని’ ఇంతకాలం పట్టించుకోని ప్రధాన సంఘాలు కార్మికుల్లో పెరుగుతున్న డిమాండ్ మేరకు సమస్యను భుజాన ఎత్తుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నారు.
సింగరేణిలో సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయనేది స్పష్టం అవుతోంది. ఇందుకు ప్రధాన సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, సికాసం, డిస్మిస్డ్ కార్మిక సంఘం, టీపీఎఫ్, అన్‌ఫిట్ ఫోరం నాయకులు, కార్యకర్తలు ఏకమవుతున్నారు. వారసత్వ ఉద్యోగాలతో పాటు, డిస్మిస్డ్, వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆయా సంఘాలు ఈనెల 26న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారుు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు యూజమాన్యం సుముఖంగా లేకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఇంకా నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తుండడంతో ప్రధాన సంఘాలన్నీ ఐక్య పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన టీబీజీకేఎస్ కార్మికులను మోసం చేసిందనే విషయాన్ని వివరించడానికే సమ్మె బాట పడుతున్నట్లు ఆ సంఘాలు స్పష్టం చేస్తున్నా యి. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో సమ్మెకు వెళితే కార్మికుల నుంచి అంతగా స్పందన రాదనే అభిప్రాయంతో మరికొన్ని సంఘాల దూరంగా ఉన్నట్లు సమాచారం.
నష్ట నివారణకు టీబీజీకేఎస్ కసరత్తు
వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ విషయంలో ప్రధాన ప్రతిపక్షాలు సమ్మె వరకు వెళితే తమకు భారీగా నష్టం జరిగే అవకాశముందని గ్రహించిన గుర్తింపు కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆయూ సంఘాలకు ఆ అవకాశం ఇవ్వకుండా చూసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. సమ్మె నోటీసు ఇవ్వడానికి ముందుగానే అధిష్టానంతో వారసత్వ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయించేందుకు సర్వ శక్తులను కూడగట్టుకుని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికల సమయానికి ‘వారసత్వ’ ప్రకటన చేసి ఇప్పటి వరకు కార్మికుల్లో యూనియన్‌పై పెంచుకున్న అపనమ్మకాన్ని తుడిచివేయడంతో పాటు ప్రతిపక్ష సంఘాల నోళ్లు మూయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో సీఎం కేసీఆర్‌తో హామీలు అమలు చేరుంచేందుకు సమాయత్తమవుతున్నారు.