హై అలర్ట్
సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మూడంచెల భద్రత
జాగిలాలతో తనిఖీలు
కాశిమేడులో యువకుడి చొరబాటు?
టీనగర్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో మూడంచెల భద్రత కల్పించారు. పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు. ఇలావుండగా కాశిమేడులోగల కోస్ట్‌గార్డ్ కార్యాలయంలోకి ఒక యువకుడు హద్దులు దాటి ప్రవేశించాడు.
అతని వద్ద పోలీసు లు తీవ్ర విచారణ జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరుగనున్నాయి. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి తీవ్రవాదులు చొరబడి దాడులకు పాల్పడడం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీవ్రవాదుల చొరబాటు వంటి చర్యలతో ఈ భద్రతను పెంచారు.
రిపబ్లిక్ డే ఉత్సవాలకు భగ్నం కలిగించే రీతిలో ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడనున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోను భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తీరప్రాంతాల్లోనే కాకుండా, అనేక ముఖ్య నగరాలను భద్రతా వలయం కిందికి తెచ్చారు. చెన్నైలో వాణిజ్య సముదాయాలు, ఆలయాలు, రద్దీ ప్రాంతాల్లోను నిఘా ఏర్పాటు చేశారు.
సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో..
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో మూడంచెల పోలీసు భద్రత కల్పించారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలోగల రెండు ప్రవేశ ద్వారాలు, సబర్బన్ రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.70 మందికి పైగా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు అన్నింటిలోను తీవ్రంగా తనిఖీలు జరుపుతున్నారు. ఇదే విధంగా ఎగ్మూరు రైల్వే స్టేషన్‌లోను భద్రతా ఏర్పాట్లు చేశారు.
విమానాశ్రయంలో..
చెన్నై విమానాశ్రయంలో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఇక్కడ సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సీఐఎస్‌ఎఫ్ జవానులు, స్థానిక పోలీసులు విమానాశ్రయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. కోయంబేడు బస్టాండులోను అదనపు పోలీసు భద్రత కల్పించారు. 27వ తేదీ వరకు ఈ భ ద్రత కొనసాగుతుందని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.