‘స్కైప్‌’ సాక్ష్యం చెల్లుతుంది! | High Court allows spouse to depose from US | Sakshi
Sakshi News home page

‘స్కైప్‌’ సాక్ష్యం చెల్లుతుంది!

Published Sun, Nov 6 2016 7:59 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

‘స్కైప్‌’ సాక్ష్యం చెల్లుతుంది! - Sakshi

‘స్కైప్‌’ సాక్ష్యం చెల్లుతుంది!

హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదు
సాంకేతిక ఉపకరణాల ద్వారా సాక్ష్యం నమోదు చేయవచ్చు
ఓ విడాకుల కేసులో కింది కోర్టు తీర్పునకు సమర్థన


సాక్షి, హైదరాబాద్‌: ఒక విడాకుల కేసులో ఇంటర్నెట్‌ వీడియో కాలింగ్‌ విధానమైన ‘స్కైప్‌’ ద్వారా సాక్ష్యం నమోదుకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో సాక్షుల విచారణ, సాక్ష్యాల నమోదుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం చట్టప్రకారం ఆమోదయోగ్యమేనని పేర్కొంది.

సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) ప్రకారం సివిల్‌ కేసుల్లో ముఖ్యంగా వైవాహిక సంబంధిత కేసుల్లో సాక్షి హాజరు అంటే వ్యక్తిగత హాజరు కానక్కరలేదని తెలిపింది. హాజరు కింద ఆడియో, వీడియో లింక్‌ల ద్వారా గానీ, స్కైప్‌ లేదా తత్సమాన సాంకేతిక విధానాల ద్వారాగానీ సాక్ష్యాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. సత్వర, సమర్థవంతమైన న్యాయాన్ని అందించేందుకు సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని.. అయితే వాటి ద్వారా సాక్షుల విచారణ, సాక్ష్యాలు నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

అమెరికా నుంచి సాక్ష్యం!
శ్రీరంగి మురళీధరరావు, శోభ భార్యాభర్తలు. మురళీధరరావు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. వారి మధ్య విభేదాలతో కోర్టుకెక్కారు. దీనికి సంబంధించి ఆఫీసులో అత్యవసర ప్రాజెక్టుల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల తన సాక్ష్యాన్ని స్కైప్‌ ద్వారా నమోదు చేసేందుకు అనుమతినివ్వాలని కొత్తగూడెం ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును మురళీధరరావు కోరారు. అందుకు కోర్టు అంగీకరిస్తూ స్కైప్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శోభ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్‌ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు.

క్రిమినల్‌ కేసు నుంచి తప్పించుకునేందుకే వ్యక్తిగతంగా హాజరుకాకుండా స్కైప్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు అనుమతి కోరారంటూ శోభ చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘‘స్వాతంత్య్రం తరువాత దేశ జనాభా పెరిగినట్లే.. పెండింగ్‌ కేసుల సంఖ్య అసాధారణ స్థాయిలో పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక భారతదేశ న్యాయవ్యవస్థ సమర్థవంతంగా న్యాయాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడింది. స్కైప్‌ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్‌ పద్ధతుల ద్వారా సాక్షులను విచారిస్తే న్యాయమూర్తికి స్పష్టమైన అవగాహన వస్తుంది. అవసరమైతే మరోసారి సాక్షిని విచారించవచ్చు..’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement