► ఈసీకి హైకోర్టు ప్రశ్న
► పిటిషనర్ వాదన పరిశీలనకు ఆదేశం
సాక్షి, చెన్నై : ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల పూర్తి వివరాల్ని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తెలియజేస్తూ బోర్డులు పెట్టేందుకు వీలుందా..? అని ఎన్నికల యంత్రాంగాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. నామినేషన్ సమయంలో సమర్పించే అన్ని వివరాలను బహిర్గతం చేయడం ద్వారా ఆయా అభ్యర్థుల తీరు ఏమిటో ఓటర్లు తెలుసుకునేందుకు వీలుందన్న పిటిషనర్ వాదనను పరిశీలించాలని సూచించింది. ఎన్నికల బరిలో నిలబడే ప్రతి అభ్యర్థి తనకు సంబంధించిన అన్ని వివరాల్ని నామినేషన్‌లో పొందు పరచాల్సిందే.
కేసులు, ఆస్తులతో పాటుగా వాస్తవిక జీవితంలో తమ ఘనతను, బండారాలను బయట పెట్టేందుకు తగ్గ వివరాల్ని తప్పని సరిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అయితే, వీటిని బయటకు ఈసీ వెలువరించడంలో జాప్యం తప్పడం లేదు. ప్రముఖులకు సంబంధించిన వివరాలు మాత్రం మీడియా తక్షణం బయటకు పెడుతున్నది. మిగిలిన అభ్యర్థుల వివరాలు గోప్యమే అనుకోవాల్సిందే. అయితే, ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో ఆలస్యంగా ఇవి వెలుగు చూడటం జరుగుతున్నది. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆళ్వార్ పేటకు చెందిన న్యాయవాది మురళీ ధరన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల పూర్తి వివరాల్ని ఎన్నికల కమిషన్ సేకరిస్తున్న విషయాన్ని అందులో వివరించారు. అయితే, ఆ వివరాలన్నీ గోప్యంగానే ఉండడం వలన సరైన అభ్యర్థి ఎవరో అన్నది తేల్చుకోవడంలో ఓటరుకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ వివరాలను ఓటర్లకు తెలియజేయాలని గతంలో తాను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో అయినా, ఓటర్లకు అభ్యర్థుల వివరాల్ని తెలియజేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద పోస్టర్లు, బోర్డుల రూపంలో ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే, అభ్యర్థులకు సంబంధించిన వివరాల్ని వెను వెంటనే ఎన్నికల యంత్రాంగం వెబ్ సైట్లో ప్రకటిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే, ఆన్‌లైన్ గురించి పూర్తి సమాచారం, ఆ సేవల్ని పొందే వాళ్లు రాష్ట్రంలో తక్కువే అని, దీనిని పరిగనలోకి తీసుకుని, ఆ వివరాల్ని ఆన్‌లైన్‌లో పొందు పరచడం కన్నా, పోలింగ్ బూత్‌ల వద్ద ప్రకటనలుగా బోర్డులు, పోస్టర్ల ద్వారా పొందు పరిస్తే, వాటిని ఓటర్లు తెలుసుకునేందుకు వీలు ఉందని ఆ పిటిషన్‌లో వివరించారు.
అభ్యర్థుల ఫోటోలతో పాటుగా వివరాల్ని తెలియజేయడం ద్వారా ఎవరు ఏమిటో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఆస్తులు ఏమిటో, ఏ అభ్యర్థి అయితే, తమ కోసం శ్రమించగలడు, అన్న విషయాన్ని ఓటర్లు పరిగణించి తమ హక్కును వినియోగించుకునేందుకు ఈ ప్రక్రియ కొత్త మార్గంగా ఉండొచ్చని సూచించారు. ఇందుకు తగ్గ ఆదేశాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ పరిగణలోకి తీసుకుంది. పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ, వివరాల్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తెలియజేయవచ్చా, అందుకు తగ్గ అవకాశాలు ఉన్నాయా అని పేర్కొంటూ, పిటిషనర్ వాదనను పరిశీలించాలని ఎన్నికల యంత్రాంగానికి ఆదేశాల్ని బెంచ్ జారీ చేసింది.
వీలుందా?
Published Sat, Apr 2 2016 3:14 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement
Advertisement