మోక్షం లేనట్టేనా..? | trs leaders hops to nominated Post | Sakshi
Sakshi News home page

మోక్షం లేనట్టేనా..?

Published Wed, May 3 2017 2:53 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

మోక్షం లేనట్టేనా..? - Sakshi

మోక్షం లేనట్టేనా..?

సాక్షి, నల్లగొండ: పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అదిగో... ఇదిగో అని ఊరిస్తున్న నామినేటెడ్‌ పోస్టుల విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలకు ఆశాభంగమే కానుందా..? పార్టీ ప్లీనరీ, బహిరంగసభ ముగిసిన తర్వాత తప్పకుండా వస్తాయని ఎదురుచూస్తున్న గులాబీ నాయకుల పదవులకు ఇప్పట్లో మోక్షం లేనట్టేనా..? నామినేటెడ్‌ పోస్టుల మాట అటుంచితే, అసలు పార్టీ పదవులనే భర్తీ చేసే మూడ్‌లో అధిష్టానం లేదా? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ భవన్‌ వర్గాలు.

జిల్లా కన్వీనర్లను, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు ఇటీవల జరిగిన ప్లీనరీలో పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆ కమిటీల నియామకంలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, నామినేటెడ్‌ పోస్టుల విషయానికి వస్తే పార్టీ అధినేత ఆలోచన ఎవరికీ అంతుపట్టడం లేదని, ఇప్పటివరకు ఇచ్చిన పోస్టులతోనే సరిపెడతారా లేక జిల్లా నుంచి ఎంత మంది నేతలకు పదవులు ఇస్తారనే విషయంలో స్పష్ట త లేదని, ఒకవేళ నామినేటెడ్‌ పోస్టులు ప్రకటించినా రాష్ట్రస్థాయి పదవులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ఇంకెన్నాళ్లు?
వాస్తవానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో గులాబీ నీడన శ్రమించిన తమకు పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం జరుగుతుందని, ఏదో పదవి లభిస్తుందని ఆశించిన నేతలు టీఆర్‌ఎస్‌లో పదుల సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టులు, మరికొందరు జిల్లా స్థాయి పోస్టులు ఆశించారు. అయితే, ఇప్పటివరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోస్టుల విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బండా నరేందర్‌రెడ్డి, మందుల సామేల్‌కు మాత్రమే అదృష్టం దక్కింది. వారిద్దరికీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

అయితే, వీరిద్దరితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది నేతలు పదవులు ఆశించారు. వారిలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య ప్రముఖంగా ఉన్నారు. ఎప్పుడు నామినేటెడ్‌ పోస్టుల చర్చ వచ్చినా ఆయన పేరు తెరమీదకు వచ్చింది. ఆయనతో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన జెల్లా మార్కండేయులు, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు కూడా ఉన్నారు. జర్నలిస్టు నేతగా పనిచేస్తున్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన పల్లె రవికుమార్‌కు కూడా ఏదో నామినేటెడ్‌ పదవి వస్తుందని ఆశించారు.

 వీరితో పాటు మరికొందరు కూడా నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నా వారిలో కొందరివి రాష్ట్రస్థాయి పోస్టులకు పరిశీలనకే రాకపోగా, మరికొందరికి జిల్లా పోస్టులివ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రెండు నెలల క్రితం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో మూడు జిల్లాల నేతలు హైదరాబాద్‌లో సమావేశమై పేర్లను కూడా ఇచ్చారు. ఏ, బీ, సీ గ్రూపులుగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి పదవులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్ల పదవులకు గాను నియోజకవర్గానికి 10 మం దికి పైగా పేర్లను కూడా ఇచ్చారు.

 అంతవరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఆ పేర్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే, ఇటీవలే పార్టీ సంస్థాగత కార్యక్రమాలు ముగిసి, ప్లీనరీ, బహిరంగసభలు కూడా అయిపోయిన నేపథ్యంలో నేడో, రేపో నామినేటెడ్‌ పోస్టులు తమకు వస్తాయని చాలా మంది ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ, అటు రాష్ట్ర, ఇటు జిల్లా స్థాయిలో పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో అధినేత కేసీఆర్‌ దృష్టిసారించలేదని పార్టీ వర్గాలంటున్నాయి.

ఫలానా వారికి ఫలానా పదవి వచ్చిందని కూడా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదని, ఇప్పట్లో రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ లేనట్టేనని, ఒకవేళ ప్రకటించినా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం వస్తుందని జిల్లా పార్టీలో ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’కి వెల్లడించడం గమనార్హం. మరి, ఆ ఒక్కటైనా ప్రకటిస్తారా.... జిల్లాస్థాయి నామినేటెడ్‌ పోస్టులను ఏం చేస్తారు..? అసలు భర్తీ చేస్తారా లేదా అన్నదానికి టీఆర్‌ఎస్‌ నేతల దగ్గర సమాధానం కూడా లేకపోవడం నామినేటెడ్‌ పోస్టుల విషయంలో పార్టీకి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

పార్టీ పదవుల మాటేంటి?
నామినేటెడ్‌ పోస్టులమాట అటుంచితే, పార్టీ పదవుల విషయంలో కూడా అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఇంకా రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జరిగిన పార్టీ ప్లీనరీలో సంస్థాగత పదవులకు సంబంధించి పార్టీ రాజ్యాంగ సవరణను కూడా ఆమోదించారు. జిల్లా కమిటీలను రద్దు చేస్తూ, సంస్థాగత పదవుల గడువును రెండు నుంచి నాలుగేళ్లకు పొడగించారు. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీలో 51 మందిని తీసుకోవాలని నిర్ణయించారు.

ఒకవేళ ఈ కమిటీ ఏర్పాటు చేస్తే 31 జిల్లాల నుంచి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కనుక జిల్లా నుంచి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కనుంది. ఇక, జిల్లా కమిటీల విషయానికి వస్తే జిల్లా కమిటీని రద్దు చేసిన నేపథ్యంలో ఇద్దరు లేదా ముగ్గురిని జిల్లా కన్వీనర్లుగా నియమించాలని భావించినా, ఆ తర్వాత దాన్ని ఒక్కరికి మాత్రమే పరిమితం చేశారు. ఈ జిల్లా కన్వీనర్‌ పదవుల భర్తీ విషయంలో రాష్ట్రస్థాయిలో సామాజిక సమీకరణలు, ఇతర పార్టీ అంతర్గత విషయాలు అవరోధంగా మారుతున్నాయని తెలుస్తోంది. ఇక, చివరగా నియోజకవర్గ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కో నియోజకవర్గంలో 24 మందిని తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించింది.

ఎమ్మెల్యేలున్న చోట్ల ఎమ్మెల్యేలు, లేని చోట్ల నియోజకవర్గ ఇంచార్జులను కన్వీనర్లుగా నియమించి, వారి నేతృత్వంలో మున్సిపల్‌చైర్మన్లు, పార్టీ మండలాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర పార్టీ నేతలు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పదవుల పందేరంలో తేడాలు వస్తే అసలుకే మోసం వస్తుందనే ఆలోచనతో ఈ నియోజకవర్గ స్థాయి కమిటీలను కూడా ఇప్పట్లో నియమించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప ఇప్పట్లో అటు నామినేటెడ్, ఇటు పార్టీ పదవులకు మోక్షం లేనట్టేనని పార్టీ వర్గాల్లో చర్చజరుగుతుండడం పదవులు ఆశించిన వారిని నైరాశ్యంలో ముంచేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement