గులాబీకి పదవుల కష్టం!
♦ నామినేటెడ్, పార్టీ పదవుల కోసం టీఆర్‌ఎస్ నేతల ఎదురుచూపులు
♦ పదవులు అందనివారిలో ఆవేదన
♦ అవకాశం వచ్చినా తగిన గుర్తింపు లేదంటూ పలువురి అసంతృప్తి
♦ కార్యాలయాల్లేవు.. చేయాల్సిన పనేమిటో తెలియని స్థితి
♦ సంస్థాగత పదవులు భర్తీ చేయాలంటున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీ విషయంగా టీఆర్‌ఎస్‌లో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. పార్టీలో ముందునుంచీ ఉన్నా పదవులు రాలేదని కొందరు అసం తృప్తితో ఉండగా.. పదవులు దక్కినా తగిన గుర్తింపు లేదన్న భావనతో మరికొందరు ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేకుండా పోయిం దంటూ రెండు రోజుల కిందట టీఆర్‌ఎస్ తాండూరు మైనారిటీ నేత ఆత్మహ త్యాయ త్నం చేయగా... తన సీనియారిటీని గుర్తించి అయినా గుడి చైర్మన్ పదవి ఇవ్వకుం డా డైరెక్టర్ పోస్టుతో సరిపెట్టారంటూ పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన మరో నేత ప్రమాణ స్వీకారం చేయకుండా కన్నీళ్లు పెట్టు్టకున్నారు. నామినేటెడ్ పదవులే కాదు పార్టీ సంస్థాగత పదవులైనా రావడం లేదంటూ మరికొందరు నేతలు వాపోతున్నారు.
అంతా మాజీలే..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు ప్లీనరీలు జరిగాయి. గత ఏప్రిల్‌లో జరిగిన 16వ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మరోమారు పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందున్న పార్టీ కమిటీలు 2015లోనే రద్దయ్యాయి. 2015లో ఒకసారి, ఈ ఏడాది మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా జరిగాయి. అయినా సంస్థాగత పదవుల నియామకాలు చేపట్టలేదు. వాస్తవానికి పార్టీ నిబంధనావళి ప్రకారం రెండేళ్లకోసారి సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ, బహిరంగ సభలు నిర్వహిస్తున్న అగ్రనాయకత్వం సంస్థాగత నిర్మాణం, కమిటీల విషయాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ‘‘కమిటీలను నియమించాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి తేగల నాయకులెవరూ లేరు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే గడువున్నందున గ్రామ గ్రామాన పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. పార్టీకి క్షేత్రస్థాయి శ్రేణులే కీలకం. వారికి కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వకుండానే.. వారి నుంచి పార్టీకి సేవలు ఆశించలేం కదా..’’అని టీఆర్‌ఎస్ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం.
మారిన నిబంధనలతో సమస్య
16వ ప్లీనరీలో టీఆర్‌ఎస్ నిబంధనావళికి కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం టీఆర్‌ఎస్‌కు జిల్లా కమిటీలేవీ ఉండవు. బదులుగా ప్రతీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు ఎమ్మెల్యేల నేతృత్వంలో పనిచేస్తాయి. దీంతో అసలుకే ఎసరు వచ్చేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జిల్లా కమిటీల్లో ప్రతీ నియోజకవర్గం నుంచి ముఖ్యులు అనుకున్న నాయకులకు స్థానం ఉండేది. వారికి జిల్లా స్థాయి పదవితో గుర్తింపు ఉండేది. కానీ ఇక నుంచి టీఆర్‌ఎస్‌లో జిల్లాకు ఓ ఇద్దరు ముగ్గురు ఇన్‌చార్జులు మాత్రమే ఉండనున్నారు. దానివల్ల ఎక్కువ మందికి పార్టీ కమిటీల్లో స్థానం లేకుండా పోతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీకి కూడా అతీగతీ లేకుండాపోయింది. పోలిట్‌బ్యూరో సైతం మూడేళ్లుగా భర్తీ కాలేదు.
పదవి ఉన్నా లేనట్లే
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ కొంత ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్లు, దేవాలయాల పాలకమండళ్లు సహా రాష్ట్రస్థాయిలో నలభైకి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మునుపెన్నడూ లేని కొత్త కొత్త కార్పొరేషన్లనూ సృష్టించారు. అయితే తొలుత భర్తీ చేసిన చైర్మన్లకే కార్యాలయాలు, చేయడానికి కొంత పని ఉంది. కానీ తర్వాత జరిగిన నియామకాలకు సంబంధించి కార్యాలయాలు లేవు. అసలు వారి విధులేమిటో, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. పార్టీ అధినేతకు దగ్గర అని పేరున్న ఓ నాయకుడికి ఇటీవల ఓ కార్పొరేషన్ పదవి దక్కింది. కానీ ఆయనకు కూర్చోవడానికి క్యాబిన్, సీటు లేకపోవడంతో ఆ శాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సీటునే వినియోగించుకుంటున్నారు. దీంతో ఆ అధికారి కినుక వహించారు. ఇక మరో సీనియర్ నేతకు కార్యాలయం ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం కావడంతో.. కొన్నాళ్ల పాటు సంబంధిత శాఖ మంత్రి పేషీని ఉపయోగించుకున్నారు. చివరకు అటు వైపు వెళ్లడమే మానేశారు. దీంతో పదవులు వచ్చాయన్న సంతోషం కూడా లేకుండా పోయిందని నేతలు వాపోతున్నారు.