
రక్షణ కల్పించండి మహిళా ఎంపీ భర్త ఆవేదన
టీనగర్: తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ తిరుపూరు అన్నాడీఎంకే మహిళా ఎంపీ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపూరు నియోజకవర్గం అన్నాడీఎంకే ఎంపీ సత్యభామ (46). ఈమె సొంతవూరు ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం (గోబి) సమీపంలోగల సిరువలూరు. ఆమె భర్త వాసు (48). ఈయన వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సత్యభామ, వాసులు మూడేళ్లుగా విడిపోయి జీవిస్తున్నారు. వీరి ఒకే కుమారుడు సత్యవసంత్. సత్యభామతో నివసిస్తున్నారు.
దంపతుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఈ మధ్య వాట్సాప్‌లో విడుదలై సంచలనం కలిగించింది. ఈ క్రమంలో గోబి సమీపంలోగల సిరువలూరు ఎలందైకాడు గ్రామంలో బుధవారం ఉదయం వాసు విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తన భార్యకు గోబి నగర కార్యదర్శి సయ్యద్ బుడాన్‌షా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీంతో తనను ఎంపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. 2014 పార్లమెంటు ఎన్నికలకు ఆరునెలల క్రితమే తనను కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలో గల ఒక ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు పేర్కొన్నారు.
ఆ సమయంలో తన భార్యకు తిరుపూరు నియోజకవర్గం సీటు లభించిందన్నారు. తనను హత్య చేసేందుకు సత్యభామ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం తనకు ఆశ్రయం కల్పిస్తున్న అక్కను కూడా బెదిరిస్తున్నారని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. తన ప్రాణానికి, ఆస్తులకు ముఖ్యమంత్రి జయలలిత రక్షణ కల్పించాలని కోరారు.