ప్రేమానురాగాలు పంచాల్సిన భర్త అనుమానంతో భార్యను గొంతుకోసి కడతేర్చాడు. ఈ ఘటన బట్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎగువ కోట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
చింతామణి : ప్రేమానురాగాలు పంచాల్సిన భర్త అనుమానంతో భార్యను గొంతుకోసి కడతేర్చాడు. ఈ ఘటన బట్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎగువ కోట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఇరగంపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ(32)కు 20 యేళ్ల క్రితం రామచంద్రప్పతో వివాహమైంది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లలితమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని రామచంద్రప్ప తరచూ గొడవపడేవాడు.
ఈక్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రామచంద్రరప్ప అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి నిద్రిస్తున్న లలితమ్మను వేటకొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. బిత్తరపోయిన పిల్లలు కేకలు వేయడంతో రామచంద్రప్ప పారిపోయాడు. స్థానికులు వెళ్లి పరిశీలించగా అప్పటికే లలితమ్మ విగతజీవిగా కనిపించింది.
శనివారం ఉదయం బట్లపల్లి రూరల్ సీఐ వెంకటేశ్‌మూర్తి స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతామణి ప్రభుత్వానికి తరలించారు. నిందితుడు రామచంద్రమూర్తిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా తల్లి హత్యకు గురికావడం, తండ్రి కటకటాలపాలు కావడంతో ఆ దంపతుల పిల్లలు అనాథలుగా మారారు.