నాకు రెండో కోణం ఎదురుకాలేదు: కత్రినా
తాను నటించిన సినిమాల్లో అనేకం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయని, అందువల్ల తానెంతో అదృష్టవంతురాలినని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్వంగా చెప్పింది. 31 ఏళ్ల కత్రినా నటించిన ‘ధూమ్-3’, ‘ఏక్ థా టైగర్’, జబ్ తక్ హై జాన్’, ‘రాజ్‌నీతి’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘బాక్సాఫీస్ వద్ద విజయం అనేది నాకొక విషయమే కాదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ రంగంలో ఉన్నవారు దేనినైనా మనస్ఫూర్తిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ రెండో కోణం ఎదురుకాకపోవడం. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి.
అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమాకూడా అదే జాబితాలోకి చేరుతుందని ఆశిస్తున్నా. ఎంతో కష్టపడి నటించిన తర్వాత కూడా సినిమా ఆడకపోతే ఎవరికైనా గుండె పిండి అవుతుంది. అది అంత మంచిది కూడా కాదు’ అని అంది. ఇండస్ట్రీలో నంబర్ అనిపించుకునే స్థాయిలో ఉన్న కత్రినా...ప్రేక్షకులు తనను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మురిసిపోతోంది. అయితే ప్రేక్షకులు నటులను ఆదరించాలని, ఆమోదించాలని చెబుతోంది. ‘ప్రేక్షకుల ఆమోదముద్ర అనేది నాకు ఎంతో ముఖ్యం. మన ప్రేక్షకులు నిజాయితీ కలిగినవారు. అవలీలగా క్షమించేస్తారు. వారు ఎంతో మంచివారు కూడా. నటన బాగుంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు’ అని అంది. కాగా కత్రినా తాజాగా నటించిన ‘బిగ్ బ్యాంగ్’ సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల కానుంది.