
తుదిశ్వాస వరకు చిన్నమ్మ వైపే..
సెంథిల్ బాలాజీ
టీనగర్ : తాను పన్నీర్‌సెల్వం వర్గంలో చేరనున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయని, తన ప్రాణాలున్నంత వరకు శశికళ వైపే ఉంటానని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ తెలిపారు. ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే శశికళ వర్గం, ఓపీఎస్ వర్గం, దీప వర్గంగా విడిపోయాయి. మాజీ మంత్రి, అరవకురిచ్చి నియోజకవర్గం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ శశికళ మద్దతు వర్గంలో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఎడపాడి పళనిస్వామికి మద్దతుగా ఓటు వేశారు. ఇలాఉండగా సోమవారం సెంథిల్ బాలాజీ ఓపీఎస్ నివాసానికి చేరుకోనున్నట్లు మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి.
దీంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి అరవకురిచ్చి నియోజకవర్గంలో ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు పర్యటన జరిపిన సెంథిల్ బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రచార మాధ్యమాలలో తన గురించి అసత్య వార్తలు ప్రసారమవుతున్నాయని తెలిపారు. తాను అన్నాడీఎంకేలో పలు పదవులు చేపట్టానని, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతో ప్రధాన కార్యదర్శి శశికళ మార్గదర్శకత్వంలో తుదిశ్వాస విడిచే వరకు శశికళ వైపే ఉంటానని పేర్కొన్నారు. తనపై గిట్టనివారు అసత్య ప్రచారాలను చేస్తున్నట్లు ఆరోపించారు.