తండ్రి లాంటి ఆయనతో డ్యూయెట్లా?
‘రజినీకాంత్ తండ్రి లాంటివారు. ఆయనతో డ్యూయెట్లు పాడడమా’ అంటోంది నటి మండీ టక్కర్. ఎవరామే అని అనుకుంటున్నారా? టక్కున ఆమె మీ ఆలోచనల్లోకి రాకపోవచ్చు. కారణం ఈ పంజాబీ బ్యూటీ నటించింది ఒక్క తమిళ చిత్రమే. అదీ కీలక పాత్రనే. బిరియానీ చిత్రం చూసినవారికి మండీ టక్కర్ గుర్తుండవచ్చు. ఆ చిత్రంలో తన అందాలతో నటుడు కార్తీకే మైకం కమ్మించిన భామ. పంజాబ్‌లో పెరిగిన ఈ బ్రిటీష్ ఇండియన్ బ్యూటీ పంజాబీలో మంచి పేరున్న కథానాయిక అన్నది గమనార్హం. అలాగే బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసిన మండీ టక్కర్ ఒక భేటీలో పేర్కొంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుందని తెలిపింది. అలాగే అలాంటి అవకాశం కోసం తానూ ఎదురు చూస్తున్నానంది.
అయితే ఆయనతో డ్యూయెట్లు పాడాలనుకోవడం లేదని అంది. రజినీ, అమితాబ్ తదితరులను తన తండ్రిలాంటి వారిగా భావిస్తానంది. అందువల్ల వారితో యుగళ గీతాలు పాడడం సమంజసంగా కాదంది. ఈ 28 ఏళ్ల ప్రౌఢ పేర్కొంది. విశేషం ఏమిటంటే లింగా చిత్ర షూటింగ్ సమయంలో రజినీ తన స్నేహితుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తో నటిస్తున్నప్పుడు ఒక రకమైన బిడియం కలిగిందని పేర్కొనడం గమనార్హం. తనకు జ్ఞాపక శక్తి అధికం అనీ తమిళం, తెలుగు భాషల్లో నటించేటప్పుడూ సంభాషణలు బట్టీ పట్టి చేప్పేస్తాననీ నటి మండీ టక్కర్ తెలిపింది. మొత్తం మీద మళ్లీ కోలీవుడ్‌పై కన్నేసినట్లుందీ పంజాబీ భామ.