
మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: శరత్
టీనగర్ : తెన్‌కాశి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ తెలిపారు. శరత్‌కుమార్ గత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ కూటమి తరఫున తెన్‌కాశీలో పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో సమత్తువ మక్కల్ కట్చి అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగింది. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకేలో చేరడం ద్వారా తమ పార్టీ అభివృద్ధి కుంటుపడినట్లు భావిస్తున్నానన్నారు.
గత ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకూడదనే భావన ప్రజల్లో ఉందని, అందువల్ల అన్నాడీఎంకే కూటమిలో విజయకాంత్ చేరడంతో తాను చేరానన్నారు. తాను గెలుపొందిన తర్వాత తెన్‌కాశి నియోజకవర్గంలో ఇచ్చిన వాగ్దానాలల్లో 75 నుంచి 80 శాతం నెరవేర్చానన్నారు. తెన్‌కాశిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించానని, అది నెరవేరకపోవడం నిరాశకు గురించేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెన్‌కాశి నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు.