ఐబీఎం మహిళా ఉద్యోగిని హత్యకేసులో వ్యక్తి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరులో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే పంజాబ్ కు చెందిన కుసుమా రాణి సింగ్లా (31) బెంగళూరు ఐబీఎంలో ఉద్యోగం చేస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె ఇక్కడకు బదిలీపై వచ్చింది. కాడుగోడిలోని మహావీర్ కింగ్స్ ప్లేస్ అపార్ట్మెంట్లో తన స్నేహితురాలు నిధి శర్మతో కలిసి ఉంటోంది. కాగా మంగళవారం కుసుమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. లాప్టాప్ వైర్ ఛార్జర్తో ఆమె గొంతు బిగించి దుండగులు హతమార్చారు. నిధి శర్మ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి యాహూ మాజీ ఉద్యోగి సుఖ్బీర్ సింగ్ను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన కుసుమ్, సుఖ్బీర్ సింగ్... సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే కుసుమ్ వద్ద పలుమార్లు డబ్బులు తీసుకున్న అతడు మోసం చేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య గొడవలు జరగడంతో సుఖ్బీర్ సింగ్పై కొద్దిరోజుల క్రితం కుసుమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే సుఖ్బీర్ ...కుసుమ్ను హతమార్చినట్లు తెలుస్తోంది.