సభలో వెల్లడించిన సర్కారు
సాక్షి, ముంబై: కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇకనుంచి ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఐదేళ్ల పాటు అడ్మిషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉన్నత సాంకేతిక విద్యా శాఖ సహాయ మంత్రి రవీంద్ర వైకర్ వెల్లడించారు. ‘విద్యార్థుల మధ్య సరదాగా సాగాల్సిన ర్యాగింగ్ రోజురోజుకూ శృతిమించుతోంది. ఈ అవమానాన్ని భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది మృతుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులిస్తోంది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిబంధనలను మరింత కఠినం చేయాలని నిర్ణయించాం’అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుంచి కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు జరిగితే సంబంధిత విద్యార్థులతోపాటు విద్యాసంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం ఒక్క ర్యాగింగ్ మరణం కూడా నమోదు కాకుండా చూస్తామన్నారు.
ప్రవర్తనా నియమావళి అమలు
శాసనసభ్యులకు ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళిని అమలు చేశారు. ఇక నుంచి ఎక్కడ సమావేశాలు జరిగినా ఈ నియమావళి అమల్లో ఉంటుంది. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించడం, వాట్స్ అప్ ద్వారా చాటింగ్ చేయడం, ఫేస్ బుక్ తదితరాలు పరిశీలించడం లాంటి వాటిని పూర్తిగా నిషేధించారు. నూతన సభ్యులతోపాటు కొత్త మంత్రులు సభామందిరంలో క్రమశిక్షణ పాటించడం లేదు. ఇలా చేయడం సభను అవమానించడమేనని ఎన్సీపీ సభ్యులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్ పేర్కొన్నారు.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సభా జరుగుతుండగా తమ మొబైల్ ఫోన్లను నిశ్శబ్ద మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం సభా మర్యాదను ఉల్లంఘించడమేనంటూ స్పీకర్ హరీభావు బాగ్డే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని బాగ్డే పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ గుర్తులున్న ఎలాంటి వస్తువులుగాని, కండువాలుగాని, ప్ల కార్డులు గాని సభ ప్రాంగణంలోకి తీసుకు రాకూడదంటూ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ సూచించారు.
విపక్షం వాకౌట్
కేల్కర్ కమిటీ నివేదిక మీడియాకు లీకవడంపై విధానమండలిలో సోమవారం గందరగోళం చెలరేగింది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాణిక్‌రావ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడుతూ విదర్భ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేల్కర్ కమిటీ నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఇతర పార్టీల సభ్యులు మద్దతు పలికారు.
ఈ విషయమై ఎన్సీపీ సభ్యుడు అమర్‌సింగ్ పండిట్ మాట్లాడుతూ కేల్కర్ కమిటీ నివేదిక మీడియాలో ప్రచురితమైందని పేర్కొన్నారు. ‘అసలేమి జరుగుతోంది. కేల్కర్ కమిటీ నివేదిక మీడియా ఓ పత్రికలో ఎలా ప్రచురితమైంది. ఈ విషయంపై మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు’అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేల్కర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్ మాట్లాడుతూ కేల్కర్ కమిటీ నివేదిక మీడియాకు లీకవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నివేదికలో మొత్తం 700 పేజీలు ఉన్నాయని, అయితే సభా కార్యకలాపాలు మరో రెండు మాత్రమే జరగనున్నందువల్ల ఈ అంశంపై చర్చించడం కష్టసాధ్యమన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు వాకౌట్ చేశాయి.
ర్యాగింగ్‌కు పాల్పడితే ఐదేళ్లపాటు అడ్మిషన్ రద్దు
Published Mon, Dec 22 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement