‘సహకార’లో మిశ్రమ ఫలితాలు | In Cooperative bank mixed the result | Sakshi
Sakshi News home page

‘సహకార’లో మిశ్రమ ఫలితాలు

Published Thu, May 7 2015 11:48 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

‘సహకార’లో మిశ్రమ ఫలితాలు - Sakshi

‘సహకార’లో మిశ్రమ ఫలితాలు

- ముంబై బ్యాంక్‌లో, పుణేలో ఎన్సీపీ విజయం
- సింధుదుర్ గలో టచ్‌లోకి వచ్చిన రాణే
- నాందేడ్‌లో ఓటమి పాలైన అశోక్ చవాన్  ప్యానెల్
- కనిపించని శివసేన ప్రభావం
 సాక్షి, ముంబై:
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సహకార బ్యాంకులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రాబల్యాన్ని మరోమారు నిరూపించుకున్నారు. నగర్ జిల్లాలో రాధాకృష్ణ విఖే పాటిల్, పుణేలో అజీత్ పవార్, బీడ్ జిల్లాలో పంకజా ముండే-పాలవే, జల్గావ్‌లో ఏక్‌నాథ్ ఖడ్సే, లాతూర్‌లో దిలీప్ దేశ్‌ముఖ్, ముంబై బ్యాంక్‌లో ప్రవీణ్ దరేకర్, సింధుదుర్గ్ జిల్లాలో నారాయణ్ రాణే తదితర వర్గాల ఆధీనంలోకి బ్యాంకు అధికారాలు వెళ్లాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితుడైన అశోక్ చవాన్‌కు తన సొంత జిల్లా నాందేడ్‌లో గట్టి దెబ్బ తగిలింది. చవాన్ స్థానిక ఎంపీ అయినప్పటికీ బ్యాంకు ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రాబల్యం కనిపించలేదు.

ముంబైలో బీజేపీ ప్యానెల్ జోరు..
ముంబై బ్యాంక్ ఎన్నికల్లో ఇటీవల ఎమ్మెన్నెస్ నుంచి బీజేపీలో చేరిన ప్రవీణ్ దరేకర్‌కు చెందిన సహకార్ ప్యానెల్ చేతిలో శివప్రేరణ (శివ సేన) ప్యానెల్ ఓటమిపాలైంది. మొత్తం 21 స్థానాలుండగా, 15 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో సహకార్ ప్యానెల్‌కు 13 స్థానాలు, శివసేన కేవలం రెండు స్థానాలు దక్కాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని ముంబై బ్యాంక్‌లో ఆధిపత్యం చెలాయించాలని శివసేన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. శివసేన ఎంపీ సంజయ్ రావుత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ రావుత్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించినా ఫలితం మాత్రం దక్కలేదు.

పుణేలో ఎన్సీపీ వర్గం విజయ దుందుభి: పుణే జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో అజీత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 21 స్థానాల్లో 17 ఎన్సీపీ ప్యానెల్ దక్కించుకుంది. అందులో ఆరు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 13 ఎన్సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవం అయిన వాటిలో నాలుగు స్థానాలు ఎన్సీపీవి ఉన్నాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు  ఇద్దరు చొప్పున గెలిచారు.

సింధుదుర్గ్‌లో రాణే ‘కమ్ బ్యాక్’: సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల్లో రాణేకు ‘కమ్ బ్యాక్’ లభించినట్లయింది. కాంగ్రెస్‌కు చెందిన సంకల్ప సిద్ధి ప్యానెల్‌కు 12 స్థానాలు లభించాయి. పోటీ ప్యానల్ శివసేనకు చెందిన సహకార్ వైభవ్ ప్యానెల్‌కు కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి.

బీడ్‌లో ముండే పైచేయి: బీడ్ జిల్లా బ్యాంక్‌లో పంకజా ముండే-పాలవే వర్గం పైచేయి సాధించింది. మొత్తం 19 స్థానాల్లో 16 ముండే వర్గానికి దక్కాయి. ఎన్సీపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

జల్గావ్‌లో ఖడ్సే వర్గం విజయం: జల్గావ్ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే వర్గం విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు తదితర హేమాహేమీలు బరిలో దిగారు. మొత్తం 21 స్థానాల్లో ఖడ్సే వర్గం 17 స్థానాలు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది.

నగర్‌లో బాలాసాహెబ్ థోరాత్: నగర్‌లో రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాత్ ప్యానల్ మధ్య గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 21 స్థానాల్లో 11 స్థానాలు థోరాత్ వర్గానికి రాగా 10 స్థానాలు విఖే పాటిల్ వర్గానికి వచ్చాయి.

సాతారాలో ఎన్సీపీ హవా: సాతారా జిల్లాలో ఎన్సీపీ ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 21 స్థానాల్లో ఏకంగా 19 స్థానాలు ఎన్సీపీ వర్గం కైవసం చేసుకుంది. రెండు స్థానాలు ఇండిపెండెంట్లకు లభించాయి. కాగా,  ఈ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విలాస్‌కాకా పాటిల్ కూడా గెలిచారు.

లాతూర్‌లో దేశ్‌ముఖ్ ప్యానెల్ పైచేయి: లాతూర్ జిల్లాలో దిలీప్‌రావ్ దేశ్‌ముఖ్ ప్యానెల్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 19 స్థానాల్లో 17 దేశ్‌ముఖ్ వర్గం దక్కించుకుంది. మిగతా రెండు రమేశ్ కరాడ్(బీజేపీ) వర్గానికి వచ్చాయి.

నాందేడ్‌లో చవాన్‌కు ఎదురు దెబ్బ
నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు చెందిన కిసాన్ సమృద్ధి ప్యానెల్‌ను శేత్కరి వికాస్ ప్యానెల్ (శివసేన, బీజేపీ, ఎన్సీపీ కూటమి) ఓడించింది. మొత్తం 21 స్థానాల్లో శేత్కారికి 16 వచ్చాయి. చవాన్ వర్గం కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. బాంద్రా తూర్పు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలను చవాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  గెలుపు కోసం ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. కాషాయ కూటమితో పాత మిత్రపక్షం ఎన్సీపీ జత కట్టడంతో ఓటమి తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement