హాస్యభరితంగా ఇన్బా ట్వింకిల్ లిల్లీ
ఆరోగ్యానికి నవ్వును మించిన ఔషధం లేదంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి నవ్వులు రువ్వించడం చాలా అవసరం. ఈ విషయంలో కొన్ని సినిమాలు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పకతప్పదు. ఈ కోవలో వస్తున్న మరో చిత్రం ఇన్బా ట్వింకిల్ లిల్లీ. ఇంతకు ముందు కదం కదం వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన అప్పు మూవీస్ సంస్థ అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా శరత్‌కుమార్ నటించిన వైదీశ్వరన్ చిత్రాన్ని తెర కెక్కించన విద్యాధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ బామ్మలకు కథలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. కథలు కాలాన్ని అధిగమించడానికి బామ్మలే కారణం అన్నారు. అలాంటి ముగ్గురు బామ్మలు పండించే వినోదభరిత కథా చిత్రమే ఇన్బా ట్వింకిల్ లిల్లీ అన్నారు.
ఇందులో ఇన్బగ నటి శరణ్య,ట్వింకిల్‌గా కోవైసరళ, లిల్లీగా కల్పన నటిస్తున్నారని తెలిపారు.వీరి మనవరాలిగా సలీమ్ చిత్రం ఫేమ్ అశ్విత నటిస్తున్నట్లు చెప్నారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని ముగ్గురు బామ్మలు ఒక సమస్యలో చిక్కుకున్న తమ మనవరాలిని అదే సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా రక్షించుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందే చిత్ర ఇతివృత్తం అన్నారు. అయితే చిత్రం ఆద్యంతం హాస్యపు జల్లులు కురిపిస్తుందన్నారు. ఇందులో మాఫియా లీడర్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ నటిస్తున్నారని, ఇతర ముఖ్యపాత్రల్ని కత్తి అనుక్రిష్ణ, మనోబాల పోషిస్తున్నారని తెలిపారు. ధరణ్ సంగాతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆరవ తేదీన మొదలెట్టి కంటిన్యూగా నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.