
నాన్నా రూ.50 లక్షలు పంపండి
మీవల్ల ఇబ్బంది పడినవారు నన్ను కిడ్నాప్ చేసి హింసిస్తున్నారు
కిడ్నాపర్ల చెర నుంచి ఐటీ అధికారికి కొడుకు వీడియో
సాక్షి, బనశంకరి(బెంగళూరు): ఆదాయపు పన్ను (ఐటీ) అధికారి కొడుకుని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న నిరంజన్ ఉళ్లాలలో నివసిస్తున్నాడు. ఇతని కొడుకు శరత్ (19) రెండు రోజుల క్రితం జ్ఞానభారతిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా, దుండగులు అతన్ని అపహరించి రూ.50 లక్షలు ఇస్తేనే విడుదల చేస్తామని తండ్రి నిరంజన్, తల్లి, సోదరిలకు వాట్సాప్‌లో వీడియో పంపించారు. నిరంజన్ జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు.
బాధితుడు శరత్ వాట్సాప్ వీడియోలో మాట్లాడుతూ... ‘నాన్నా మీ వల్ల ఇబ్బంది పడినవారు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా వీరికి డబ్బు ఇవ్వండి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మన కుటుంబానికి ప్రమాదమని హెచ్చరించారు’ అని పేర్కొన్నాడు.