సీఎంకు భద్రత పెంపు | Increased security Chief Minister panneerselvam | Sakshi
Sakshi News home page

సీఎంకు భద్రత పెంపు

Published Mon, Mar 23 2015 1:58 AM | Last Updated on Mon, May 28 2018 1:46 PM

Increased security Chief Minister panneerselvam

 సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం నివాసానికి భద్రతను పెంచారు. గ్రీన్ వేస్ రోడ్డును భద్రతా వలయంలోకి తెచ్చారు. సీఎం భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు.  అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో సీఎంగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. భారంగానే ఆ బాధ్యతల్ని చేపట్టిన ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి చాంబర్‌లోకి అడుగు పెట్టలేదు. తమ అమ్మ జయలలిత మళ్లీ సీఎం అవుతారన్న కాంక్షతో పూజాధికార్యక్రమాల్ని ఓ వైపు నిర్వర్తిస్తూనే, మరో వైపు ఆమె అడుగు జాడల్లో, సూచనలు, సలహాలతో ప్రభుత్వాన్ని ముందుకు సాగించే పనిలో పడ్డారు. అదే సమయంలో సీఎంగా తనకు దక్కే అన్ని రకాల సౌకర్యాలను పన్నీరు నిరాకరించారు.
 
  సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తికి జడ్ కేటగిరి భద్రత ఉంటుంది. అయితే, తనకు ఎలాంటి భద్రత వద్దని తిరస్కరించారు. సీఎంకు కల్పించే కాన్వాయ్ సంఖ్యను, హడావుడిని తగ్గించేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తనకు కేటాయించిన సౌకర్యాలు, భద్రతనే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా సీఎం ఇంటిని టార్గెట్ చేసి ముట్టడి కార్యక్రమాలు సాగించే పనిలో కొన్ని సంఘాలు పడ్డాయి. అయితే, శనివారం చోటు చేసుకున్న హఠాత్పరిణామంతో తప్పని సరిగా సీఎంకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం వచ్చింది.
 
  ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నివాసం గ్రీన్ వేస్ రోడ్డులో ఉంది. ఈ రోడ్డులో పన్నీరు సూచన మేరకు  ఎలాంటి భద్రతా చర్యలు చేపట్ట లేదు. ఆయన నివాసం వద్ద మాత్రం మంత్రికి కల్పించే భద్రతా సిబ్బంది మాత్రం ఉంటూ వచ్చారు. తాజాగా ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించడం, పిట్ట గోడను దూకి లోనికి వెళ్లేందుకు యత్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసు యంత్రాం గం తీవ్రంగా పరిగణించింది. సీఎం పన్నీరు సెల్వం తిరస్కరించినా సరే, ఆయనకు భద్రతను పెంచాల్సిందేనన్న నిర్ణయానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. ఆమ్ ఆద్మీ ముట్టడికి  భద్రతా ైవె ఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిం చడంతో విచారణకు ప్రత్యేక బృందం సైతం రంగంలోకి దిగింది.
 
 ఈ బృందం పరిశీలనతో సీఎం ఇంటి పరిసరాల్లోని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటయ్యాయి. ఆయా మార్గల్లో భద్రతా సిబ్బంది నియమించారు. అనుమానిత వాహనాలను తనిఖీ నిమిత్తం వారికి ఆదేశాలు సైతం ఇచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆయన ఇంటి వద్ద పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని విధులకు నియమించారు. సీఎం పన్నీరు సెల్వంకు భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఆమ్ ఆద్మీ ముట్టడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో, ఆ ఘటన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు గుసగుసలాడటం కొసమెరుపు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement