దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య చేశారు
పుణె: పలు భాషల్లో నిర్మించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తీసిన ఈ సినిమాలో మీనా.. తన కుమార్తెను బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడి నుంచి కాపాడుకోవడం కోసం అనుకోకుండా అతన్ని చంపేస్తుంది. హీరో వెంకటేష్ తన భార్య, కుమార్తెలను హత్య కేసు నుంచి రక్షించడం కోసం ఎవరికీ తెలియని చోట శవాన్ని పూడ్చిపెట్టి, సాక్ష్యం దొరకకుండా చేస్తాడు. బాలీవుడ్‌లో రీమేక్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటించాడు. ఈ సినిమా స్ఫూర్తితో మహారాష్ట్రకు చెందిన తండ్రీకొడుకు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. కాగా సినిమాలో మాదిరిగా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు.
చిక్లికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్ (54), ఆయన కొడుకు మెహబూబ్ మనియార్ (26) 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. కాగా వీళ్లు సకాలంలో అప్పు తీర్చకపోవడంతో శ్రీరామ్ డిమాండ్ చేశాడు. అప్పు, వడ్డీ కలపి 8.40 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. అప్పు ఎగ్గొట్టేందుకు మనియార్లు దృశ్యం సినిమా తరహాలో శ్రీరామ్‌ను చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని పథకం వేశారు. గతేడాది సెప్టెంబరులో చిక్లీ ప్రాంతంలో వాళ్లు ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడేందుకని శ్రీరామ్‌ను ఈ ప్లాట్‌కు పిలిచి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతని శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్‌లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. మనియార్లు ఈ విషయం ఇక ఎవరికి తెలియదనుకుని ఏమీ తెలియనట్టు ఉండిపోయారు.
కాగా ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాను ఆధారంగా అతను మనియార్లతో అప్పు విషయంపై గొడవపడ్డాడని, పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మనియార్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. మనియార్ల గురించి పోలీసులు విచారించగా, వాళ్లు సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. గురువారం మెహబూబ్ చిక్లీ తిరిగి రాగా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. శుక్రవారం హత్య జరిగిన ప్రాంతం నుంచి శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సమిదుల్లాను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.