అంతర్జాతీయ సదస్సులో ‘మూడవ’ గళం
- ‘జపాన్ మీట్’లో ప్రసంగించనున్న కర్ణాటక వాసి
- ‘థర్డ్ జెండర్’పై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనే ప్రధాన అంశం
- బెంగళూరుకు చెందిన ట్రాన్స్‌జెండర్‌కు అరుదైన అవకాశం
సాక్షి, బెంగళూరు : ‘ట్రాన్స్ జెండర్’, నిన్న మొన్నటి వరకు ఈ పదాన్ని వింటేనే చాలా మంది ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవారు. ఈ జెండర్‌లోని వారంతా ఏదో పాపం చేసినట్లు మాట్లాడుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇతర పౌరుల్లాగే ‘ట్రాన్స్ జెండర్’లోని వ్యక్తులను కూడా ‘థర్డ్ జెండర్’గా పరిగణిస్తూ వారికి సమాన హక్కులతో పాటు అవకాశాలు, సదుపాయాలు కల్పించాల్సి ఉందంటూ సుప్రీం కోర్టు గత ఏప్రిల్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘థర్డ్ జెండర్’కి కల్పించాల్సిన హక్కులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు ఇదే అంశంపై అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగించే అవకాశం నగరానికి చెందిన ట్రాన్స్ జెండర్ అకాయ్ పద్మశాలికి లభించింది. ఆదివారం నుంచి జపాన్‌లోని టోక్యో నగరంలో ప్రారంభమైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో అకాయ్ ప్రసంగించనున్నారు.
అసలేమిటీ సదస్సు....
ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఈ ఏడాది జపాన్‌లోని టోక్యో నగరంలో ఏర్పాటైంది. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 24 వరకు కొనసాగనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయనిపుణులంతా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఈ ఏడాది ఈ సదస్సులో ‘సెక్సువల్ మైనారిటీస్’కి చెందిన హక్కుల ఉల్లంఘన, న్యాయపరమైన విషయాలను సైతం ఈ సదస్సులో చర్చించేందుకు నిర్ణయించారు. అందుకే భారతదేశంలో ట్రాన్స్ జెండర్స్ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం ముందుంచేందుకు గాను నగరానికి చెందిన ట్రాన్స్‌జెండర్ అకాయ్ పద్మశాలికి ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్ ఆహ్వానాన్ని పంపింది.
ఎవరీ అకాయ్....
అకాయ్ పద్మశాలి, బెంగళూరు నగరంలో పుట్టి పెరిగింది. ఇక్కడే పదో తరగతి వరకు చదివింది. పై చదువులు చదవాలనే కోరిక ఆమెలో ఉన్నా అప్పటికే సమాజం నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలు ఆమెను కళాశాలకు దూరం చేశాయి. అయినా ఆమె తన పోరాట పటిమను ఎక్కడా వదులుకోలేదు. తనతో పాటు తనలాంటి వారెందరికో సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలను ధీటుగా ఎదుర్కొనేందుకు గాను ‘సంగమ’ సంస్థలో చేరడంతో పాటు ఆ సంస్థ ద్వారా ‘ట్రాన్స్‌జెండర్స్’కు అందాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా అందరిృదష్టిని ఆకర్షించారు. ఇంకా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో ట్రాన్స్‌జెండర్స్ సమస్యల పై ప్రసంగించి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనపైనే ప్రధానృదష్టి ....
న్యాయరంగంలోని ప్రముఖులంతా ఒక చోట చేరే ప్రతి ష్టాత్మక సదస్సులో ప్రసంగించేందుకు అవకాశం లభిం చడం గర్వంగా ఉంది. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ న్యాయనిపుణులతో పాటు ఈ రంగంలోని వేలాది మంది విద్యార్థులు, లెక్చరర్‌లు పాల్గొననున్నారు. ఇక ఈ సదస్సులో భారతదేశంలో ట్రాన్స్‌జెండర్స్‌పై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సదుపాయాలు ముఖ్యంగా వైద్య, ఆరోగ్యానికి సంబంధిం చిన విషయాలతో పాటు ఇందుకు న్యాయపరంగా అవసరమన అంశాలపై నా ప్రసంగం సాగనుంది. ఇక ట్రాన్స్‌జెండర్స్‌ను ‘థర్డ్ జెండర్’గా గుర్తిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలప కూడా ప్రసంగించనున్నాను.
- అకాయ్, సంగమ సంస్థ ప్రతినిధి