సాక్షి ప్రతినిధి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో అన్నాడీఎంకే నేత ఫాంహౌస్‌పై ఫ్లయింగ్ స్క్వాడ్, ఆదాయపు పన్నుశాఖాధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. తమిళనాడు ప్ర భుత్వంలోని ప్రముఖ మంత్రులకు సన్నిహితుడైన ఒక డాక్టర్‌కు చెందిన ఈ ఫాంహౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు పెద్ద సూట్‌కేసులతో అధికారులు వెళ్లిపోయారు. మంత్రులు పన్నీర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ జయరామన్‌లకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ మహేంద్రన్ (48)కు పొల్లాచ్చిలో ఫాంహౌస్ ఉంది.
ఈ ఫాం హౌస్‌కు పన్నీర్‌సెల్వం, జయరామన్ తరచూ వచ్చి వెళుతున్నారని, అక్కడ భారీ ఎత్తున నగదును దాచిపెట్టి ఉండొచ్చని ఆదాయపు పన్నుశాఖాధికారులకు సమాచారం అందింది. ఆదాయపు పన్నుశాఖ సహాయ కమిషనర్ రాణీ కాంచన, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు బుధవారం ఉదయం 11 గంటలకు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు తనిఖీలు కొనసాగుతుండగా ఎన్నికల పరిశీలకులు (అభ్యర్థుల ఖర్చు) అనుప్ హిలాయ్ అక్కడి చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు సోదాలు పూర్తి చేశారు. ఆ ఫాంహౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు పెద్ద సూట్ కేసులతో ఆదాయపు పన్నుశాఖాధికారులు వెళ్లిపోయారు. ఆ సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు, భారీస్థాయిలో నగదు ఉన్నట్లు సమాచారం.
ఆ తరవాత కొద్దిసేపటికి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరిశీలకులు ఫాం హౌస్ నుంచి బైటకు రాగా డీఎంకే నేతలు వారిని చుట్టుముట్టారు. ఇక్కడ జరిపిన తనిఖీల్లో ఏమేమి స్వాధీనం చేసుకున్నారో వివరించాలని పట్టుపట్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం దాడు లు జరిపామని, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటే అరెస్ట్ చేయాల్సి వస్తుందని డీఎస్పీ చార్లస్ హెచ్చరించడంతో డీఎంకే నేతలు వైదొలిగారు. డాక్టర్ మహేంద్రన్‌ను మీడియా ప్రశ్నించగా, తమ ఫాంహౌస్‌పై జరిగింది రైడ్ కాదు, కేవలం విచారణ మాత్రమేనని అన్నారు. పన్నీర్ సెల్వంను తాను టీవీలో మాత్రమే చూశాను, అయితే డిప్యూటీ కమిషనర్ జయరామన్ మాత్రం తన బంధువని అన్నారు. కేవలం అన్నాడీఎంకేలోనే కాదు, డీఎంకేలో సైతం బంధువులు ఉన్నట్లు చెప్పారు.
బుధ, గురువారాల్లో పలుచోట్ల దాడులు:
విల్లుపురం నియోజకవర్గ పరిధిలోని మేల్‌పాది అనేచోట బుధవారం రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పుదుచ్చేరి నుంచి వస్తున్న ఒక మినీ లారీలో రూ.11.5 లక్షలు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత గురువారం నాటి వరకు జరిపిన వాహన తనిఖీలు, దాడుల్లో రూ.66 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఆత్తూరు సమీపంలో గురువారం ఒక కంటైనర్ లారీని తనిఖీ చేయగా రూ.1 కోటి విలువైన కంప్యూటర్లు బైటపడ్డాయి. తగిన డాక్యుమెంట్లు చూపక పోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉచిత మిక్సీ, గ్రైండర్‌లతో బయలుదేరుతున్న లారీని పుళల్ సమీపంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలపై గోప్యమేల:
అధికార పార్టీకి చెందిన నేతల ఇళ్లు, ఫాంహౌస్‌లు, గిడ్డంగులపై దాడులు జరపడమేగానీ స్వాధీనం చేసుకున్న వాటి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈనెల 8 వ తేదీన కరూరు జిల్లా కృష్ణరాయపురంలో నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్ది కారును తనిఖీ చేయగా అందులో నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ డబ్బును తిరిగి ఇచ్చేయమని ఆదేశించారని ఆరోపిస్తున్నారు. 22న అన్బునాథన్ గిడ్డంగి, ఫాంహౌస్‌ల్లోరూ.5 కోట్లు స్వాధీనం చేసుకున్నా పూర్తి వివరాలు బైటపెట్టలేదని అంటున్నారు. 23 వ తేదీన ఈరోడ్డు జిల్లా గోపీ పంచాయితీ యూనియన్ అధ్యక్షురాలి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు వివరాలు వెల్లడించకుండానే వెళ్లిపోయారని విమర్శిస్తున్నారు. ఇలా అనేక తనిఖీల్లో వివరాలను గోప్యంగా ఉంచడం అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనని ప్రతిపక్షాల నేతల ప్రశ్నిస్తున్నారు.
మంత్రి పన్నీర్ అనుచరుని ఫాంహౌస్‌పై దాడులు
Published Fri, Apr 29 2016 3:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement