ఐటీ కొరడా | IT raid at premises of former power minister Natham Viswanathan | Sakshi
Sakshi News home page

ఐటీ కొరడా

Published Tue, Sep 13 2016 8:23 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM

ఐటీ కొరడా - Sakshi

ఐటీ కొరడా

మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే నగరంలోని ఓ  జ్యువెలరీలో కూడా తనిఖీలు నిర్వహించారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మేయర్ సైదై దొరస్వామి ఇల్లు సీఐటీ నగర్‌లోనూ, ఆయన కుమారుని ఇల్లు సేలయ్యూర్ మాడపాక్కలో ఉంది. ఈ ఇళ్లతోపాటూ వీరికి సొంతమైన కార్యాలయాల్లోకి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మికంగా ప్రవేశించారు. మేయర్ సెల్‌ఫోన్, ల్యాండ్ ఫోన్లలో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇంటి బయట సాయుధ పోలీసులను బందోబస్తు పెట్టి లోనికి ఎవ్వరినీ అనుమతించలేదు. ఆ తరువాత ఇంటిలోని అన్ని గదులు, నలుమూలలా తనిఖీలు ప్రారంభించారు.

సేలయ్యూర్‌లోని మేయర్ కుమారుడి ఫాంహౌస్‌పై కూడా అదే సమయంలో దాడులు జరిపారు. అలాగే చెన్నై టీనగర్ చిన్నయ్యాపిళై్ల వీధిలోని మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ఇల్లు, దిండుగల్లు జిల్లా వేంపార్‌పట్టియల్‌లోని అతని కుమారుడు అమర్‌నాథ్, బావమరిది కన్నన్ నివసించే ఇల్లు, ఉలపక్కుడిలోని ఎన్‌పీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకేసారి దాడులు నిర్వహించారు. ఎన్‌పీఆర్ కళాశాలలో ఆదివారం వరకు టీఎన్‌పీఎస్ క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరపడం గమనార్హం.

జ్యువెలరీపై దాడి  
అలాగే కోయంబత్తూరు కేంద్రంగా చెన్నై, దిండుగల్లులో బంగారు నగల వ్యాపారాలు నిర్వహిస్తున్న జ్యువెలరీలపైనా, యజమానుల ఇళ్లపై ఐటీ దాడులు జరిపారు. కోవై గ్రేస్‌రోడ్డు, రాజావీధి, ఆర్‌ఎస్‌పురంలలో కాళిదాస్ నగల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ బంగారు, డైమం డ్స్ నగల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల యాజమాన్యాల ఇళ్లు కోవై ఆర్‌ఎస్‌పురంలో ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైకి చెందిన ఆదాయపు పన్నుశాఖాధికారుల నాలుగు బృందాలు వేర్వేరుగా రెండు దుకాణాలు, ఇళ్లపైనా దాడులకు దిగాయి. అలాగే మధురైలోని మీనాక్షి వైద్యశాలపై కూడా ఆకస్మిక దాడులు జరిపారు. ఇలా తమిళనాడు మొత్తం మీద ఏకకాలంలో 40 చోట్ల దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, నగలు, డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఐటీ దాడులు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి.

నత్తంపై పార్టీ వేటు
ఐటీ దాడుల నేపథ్యంలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌పై అన్నాడీఎంకే వేటు వేసింది. పార్టీ నిర్వాహక కార్యదర్శి, కార్యవర్గ కమిటీ కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ఆదేశాలు జారీచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement