విదేశాల్లో ‘నాన్ యార్’
దర్శకుడు, నిర్మాత, నటుడు ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభను చాటుకునే విధంగా నిరంతర ప్రయత్నంలో ఉన్న నటుడు జై ఆకాష్. అలాంటి నటుడి తాజా ప్రయత్నం నాన్‌యార్. ఈయన కథ, కథనం రాసి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నాయకిగా లండన్‌కు చెందిన మోడల్ ప్రియ నటిస్తున్నారు. జై బాలాజీ మూవీ మేకర్స్, రానం ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు ఎన్.రాధ. చిత్రం పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి జై ఆకాష్ తెలుపుతూ పట్టుభద్రుడైన హీరోకు లండన్‌లో ఉద్యోగం వస్తుందన్నారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న తాను భార్యతో కలసి లండన్ వెళతారన్నారు. అక్కడ సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వీరికి ఊహించని ముప్పు ఏర్పడుతుందన్నారు. దీంతో హీరోలో అనూహ్య మార్పు చోటు చేసుకుంటుందని తెలిపారు. తానెవరో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తారని తెలిపారు. అసలు అందుకు కారణాలేమిటి? ఆ తరువాత ఏమి జరిగిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో దెయ్యాలు, భూతాలు లేకుండానే సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథ సాగుతుందని చెప్పారు. సుమన్‌శెట్టి, జాన్సన్, సోనియా శర్మ, దేవంతి, నహీనా, రాధ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యూకే. మురళి సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది.