
ఉత్తరాదిపైనే...
- కరుణ చూపని జైట్లీ బడ్జెట్
- తుమకూరులో పారిశ్రామిక కారిడార్
- మైసూరులో టెక్స్‌టైల్ క్లస్టర్
- బెంగళూరుకు బయో టెక్నాలజీ సెంటర్
- ఊసేలేని ఐఐటీ, ఐఐఎంల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆయన చూపంతా ‘ఉత్తరాది’పైనే ఉన్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి రాష్ట్రానికి జైట్లీ ఎంతో కొంత విదిల్చారు.
తుమకూరులో పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి రూ.100 కోట్లు, మైసూరులో టెక్స్‌టైల్ క్లస్టర్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. బెంగళూరుకు బయో-టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేశారు. బెంగళూరు-ముంబై ప్రాథమిక వసతుల కారిడార్‌ను నిర్ణీత గడువులోగానే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే మెట్రో రైలు గురించి ఆయన ఈ బడ్జెట్‌లో ఊసెత్తలేదు. అలాగే దీర్ఘకాలంగా రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎంలను మంజూరు చేయాలన్న విజ్ఞప్తులూ అరణ్య రోదనగానే మిగిలాయి.
ఐటీ రంగంతో పాటు తయారీ రంగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న బెంగళూరు పట్ల కేంద్రం చిన్న చూపు చూసిందని చెప్పక తప్పదు. మినీ ఇండియాగా మారిన బెంగళూరులో ప్రాథమిక వసతుల కల్పనకు కేంద్రం కూడా తన వంతు సాయాన్ని అందించాలని వరుస ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులు కేంద్ర పాలకుల చెవికెక్క లేదు. రాష్ర్ట పరంగా చూస్తే ఈ బడ్జెట్ నిరాశాదాయకమనే చెప్పాలి. ఈ బడ్జెట్‌పై ప్రముఖుల అభిప్రాయాలు...
అవాస్తవిక బడ్జెట్
ప్రధాని నరేంద్ర మోడీ తన కలలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా మార్కెట్ చేయడానికి ప్రయత్నించారు. రాష్ట్రానికి ఐఐటీ, ఏఐఐఎంఎస్‌లను మంజూరు చేయాలని ఎన్నో సార్లు కోరాం. విజ్ఞాన రాజధానిగా పేరు పొందిన బెంగళూరు పట్ల చిన్న చూపు చూడడం తగదు. ఎలాంటి కేటాయింపులు లేకుండానే పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. అహ్మదాబాద్, లక్నోల పట్ల ప్రత్యేక ప్రేమ చూపించారు. మొత్తానికి ఇది కంటి తుడుపు బడ్జెట్.
- సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి
ఆర్థిక పునశ్చేతనం
దేశ ఆర్థిక పునశ్చేతనానికి ఉపకరించే బడ్జెట్. సామాన్యులపై భారం వేయలేదు. మధ్య తరగతి వారికి అనుకూలమైనది. ప్రాథమిక సదుపాయాలు, వ్యవసాయ వృద్ధికి ఊతం లభిస్తుంది. గత యూపీఏ సర్కారు దేశ ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేసింది. దానిని సరి చేసే దిశగా ఇదో ముందడగు.
- అనంత కుమార్, కేంద్ర మంత్రి
నీరుగారిన నిరీక్షణ
ఎన్నికల సందర్భంగా అనేక మార్పులకు శ్రీకారం చుడతామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన బీజేపీ తన తొలి బడ్జెట్‌లోనే నిరాశకు గురిచేసింది. ఉద్యోగాలు, సృజన లాంటి రంగాల అభివృద్ధికి ఎలాంటి పథకాలను ప్రకటించలేదు. మొత్తానికిది నిరాశాదాయకమైన బడ్జెట్.
- కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి
సమగ్రమైన బడ్జెట్
వ్యవసాయ, విద్యుత్, ప్రాథమిక వసతులు, తయారీ, సేవా రంగాలకు సముచిత ప్రాధాన్యతనిచ్చిన సమగ్ర బడ్జెట్. ఆర్థికాభివృద్ధిపైనే ఈ బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. తుమకూరు సహా వంద స్మార్ట్ సిటీలను ప్రకటించడం ద్వారా పట్టణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. నాబార్డుకు నిధుల కేటాయింపు పెంపు గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తుంది.
- సందీప్ కుమార్ మైని, చైర్మన్, సీఐఐ కర్ణాటక
సగటు బడ్జెట్...
‘పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం కలిగించే బడ్జెట్. ఇన్వెస్టర్లకు, స్టాక్ మార్కెట్‌కు కూడా అనుకూలమైనదే. రెవెన్యూ వసూళ్లను సరళీకృతం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆదాయ పన్ను పరిమితిని పెంచడం మధ్య తరగతి వారికి ఊరట. అయితే ఆర్థిక సంస్కరణల ఊసు లేకపోవడం, ప్రధాన పన్ను విధానం అలాగే కొనసాగడం కాస్త నిరుత్సాహకరం. మొత్తానికిది సగటు బడ్జెట్.’
- కుమార్ జాగిర్దార్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యుడు