
కొత్తగా 5 ఐఐటీలు, 5 ఐఐఎంలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఐదు ఐఐటీలు, మరో ఐదు ఐఐఎంల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్‌గఢ్, కేరళ, జమ్మూ, గోవా రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ )లను... అలాగే మహారాష్ర్ట, పంజాబ్, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది.
ఇందుకు ప్రాథమికంగా రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ప్రపంచస్థాయి ఉన్నత విద్యా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మధ్యప్రదేశ్‌లో జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ హ్యుమానిటీస్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక విద్యా రంగానికి ఊతమిచ్చేలా ఈసారి రూ. 68,728 కోట్లను కేటాయించింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 11 శాతం అధికం. ఇందులో పాఠశాల విద్యకే అత్యధికంగా 51,828 కోట్లను వ్యయం చేయనుంది. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దేశంలోని అన్ని బాలికల పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. మొత్తంగా లక్ష మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల స్థితిగతులపై అధ్యయనానికి రూ. 30 కోట్లతో పాటు సర్వశిక్షా అభియాన్‌కు రూ. 28,635 కోట్లు, మాధ్యమిక్ శిక్షా అభియాన్‌కు రూ.4,966 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
స్కూళ్లలో కొత్త శిక్షణా పద్ధతులను అమలు చేసేందుకు, ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ కోర్సుల కోసం వర్చువల్ తరగతి గదుల ఏర్పాటుకు రూ.వంద కోట్లు వెచ్చించనున్నట్లు జైట్లీ తెలిపారు. కాగా, ఉన్నత విద్య కోసం సులువుగా రుణాలు తీసుకునేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేస్తామని కూడా చెప్పారు.