అమ్మకు చుక్కెదురు!
చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసులు బనాయించాలంటే ముందుగా తమ నుంచి అనుమతిని పొందాలన్న తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. తమిళనాడులో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే, సదరు ఆరోపణలపై కేసు నమోదు చేసే ముందు తమిళనాడు విజి లెన్స్ కమిషనర్ నుంచి అనుమతి పొందాలని 1988లో తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది.
ఈ చట్టానికి అభ్యంతరం తెలుపుతూ న్యాయవాది పుహళేంది మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)ను దాఖలు చేశారు.‘కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తే పోలీసులు కేసు నమోదు చేయవచ్చు, అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మాత్రమే తగిన చర్యలు చేపట్టాలని చెప్పడం సరికాదు.
ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరిని చాటుతోంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి, అలాగే ఉన్నతాధికారులపై సైతం వెంటనే కేసు నమోదు చేసేలా ఉత్తర్వులు జారీచేయాలి’ అంటూ పిల్ ద్వారా కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణకు రాగా, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ అనుమతి పొందేలా గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాది పుహళేంది మరో పిల్‌ను దాఖలు చేశారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే ముందు ప్రభుత్వ అనుమతి పొందాలన్న నిబంధన చట్ట విరుద్ధం కావడంతో గత ఏడాది తీసుకువచ్చిన కొత్త చట్టాని కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ తీర్పుచెప్పారు. గత ఏడాది తెచ్చిన చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వమే రద్దు చేసి ఉండాల్సింది, అయితే చివరకు కోర్టు వరకు వచ్చి తీర్పు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాఖ్యానించారు.