సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీస్థాయిలో మార్పులు చేపట్టేందుకు కొత్త సర్కారు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల వరకు అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీల కోసం కసరత్తు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షా సమావేశాలు నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని పేర్కొంటున్నాయి. ప్రాథమికంగా సమీక్షించి, ఆయా శాఖల్లో ఏం జరుగుతోందన్న అంశాలను అవగాహన చేసుకున్నాక.. ప్రక్షాళన మొదలుపెట్టనున్నట్టు వివరిస్తున్నాయి.
కొందరు అధికారులపై ఫోకస్
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు అధికారులు బీఆర్‌ఎస్ సర్కారుకు తొత్తులుగా పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. హైదరాబాద్ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌లకు స్థానభ్రంశం తప్పదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.
నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు సీసీఎల్‌ఏగా కూడా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లేదా శశాంక్ గోయల్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని తక్షణమే మార్చే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను మార్చే పక్షంలో రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు.
రిటైరైనా కొనసాగుతున్నవారికి ఉద్వాసన
పదవీ విరమణ చేసిన దేవాదాయ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను గత ప్రభుత్వం అదే పోస్టులో కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని అంటున్నారు. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ అధికారి సయ్యద్ ఒమర్ జలీల్, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన అదర్‌సిన్హా, కారి్మక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులైన రాణి కుముదిని తదితరులనూ తప్పించనున్నట్టు చెప్తున్నారు.
అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న కీలక అధికారులకు..
గత సర్కారు అప్రాధాన్య పోస్టుల్లో కొనసాగించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో.. బుర్రా వెంకటేశ్వర్లు (వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి), అనితా రామచంద్రన్ (టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి), విజయేంద్ర (ప్రత్యేక కార్యదర్శి ఆర్‌అండ్‌బీ), రాహుల్ బొజ్జా (విపత్తుల నిర్వహణ కార్యదర్శి) తదితరులు ఉన్నారు. వీరికి ప్రాధాన్య పోస్టులు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఉన్నతాధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
కలెక్టర్లకూ స్థాన చలనం
కలెక్టర్లలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, భూపాలపల్లి కలెక్టర్ భవ్యేశ్ మిశ్రా, రాజీవ్‌గాంధీ హన్మంతుతోపాటు పలువురు అధికారులకు స్థానభ్రంశం తప్పదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా చేసి.. పీఎంవోకు డిప్యూటేషన్‌పై వెళ్లిన కాట ఆమ్రపాలి తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆమె పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సంజయ్ జాజు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. వీరు కాకుండా మరో అరడజను మంది వరకు అధికారులు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. వారు ఐదేళ్లపాటు కేంద్ర సరీ్వసుల్లో డెప్యుటేషన్ పూర్తి చేసుకున్నాకే రాష్ట్ర సర్వీసుకు వస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరితే రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment