మాకు ఎయిమ్స్ కావాలి !
ప్రధానికి జయ లేఖ
టీనగర్ : రాష్ట్రంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుచేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. అందులో 2014-15 బడ్జెట్‌లో తమిళనాడులో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుచేస్తామని ప్రకటించడంతో తాను సాదరంగా ఆహ్వానిస్తూ గతంలో రాసిన లేఖలో ధన్యవాదాలు తెలిపానన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు తంజావూరులోగల చెంగిపట్టి, కాంచీపురంలోగల చెంగల్పట్టు, పుదుక్కోట్టై, ఈరోడ్ జిల్లాలోగల పెరుందురై, మదురైలో తోప్పూరు వంటి ప్రాంతాలను అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిం చిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో 2015-16 బడ్జెట్‌లోను తమిళనాడులోనూ ఎయిమ్స్ ఏర్పాటవుతుందని ప్రకటించారని, గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు కేంద్ర బృందం పైన పేర్కొన్న ఐదు ప్రాంతాలను సందర్శించి వెళ్లిందని, అయినప్పటికీ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు గురించిన ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల వైద్య అవసరాల దృష్ట్యా అతి ముఖ్యమైన ఎయిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని కోరారు.